కుక్కను చంపాలంటే దానిపై పిచ్చిది అని ముద్ర వేయాలనేది చంద్రబాబు నాయుడు బాగా పాటించే సూక్తి అంటారు. ఆ పిచ్చి ముద్రను వేసేందుకు 'ఈనాడు' పత్రికను ఉపయోగించుకుంటారు అనేది తెలుగునాట బాగా వినిపించే లోకోక్తి. తన కేబినెట్ లో మంత్రులను, తన పార్టీలో తనకు నచ్చని నేతలను తొలగించడానికి కూడా ఇదే ఫార్ములాను చంద్రబాబు నాయుడు ఫాలో అవుతాడంటారు. ఎన్టీఆర్ అంతటి వాడి మీదే చంద్రబాబు నాయుడు మీడియాను ప్రయోగించి, ఆయనను ఒక విలువల్లేని వ్యక్తిగా నిలిపాడనేది చరిత్ర! ఎన్టీఆర్ కు నైతిక విలువలు శూన్యం అనేది స్వయంగా చంద్రబాబు నాయుడు ఇండియాటుడే ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యే సుమా!
అదే ప్రయోగమే దశాబ్దాలుగా సాగుతూ ఉంది. తన పార్టీ నుంచి సాగనంపాల్సిన చోటామోటా లీడర్ల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు మీడియానే ఉపయోగించుకుంటూ వచ్చిన వైనాలను అనేకం గమనించారు తెలుగు ప్రజలు. గత పర్యాయంలో ఒక మంత్రిని తొలగించడానికి సూచనగా, ఆమె ఇంటి ఆవరణలో డబ్బుతో కూడిన బ్యాగు పడటం, ఆ విషయాన్ని ఆ వర్గం మీడియా హైలెట్ చేయడం, ఆ తర్వాత ఆ మంత్రిని తొలగించేయడం చకచకా జరిగాయి. మామూలుగా తెలుగుదేశం నేతల ఇళ్ల ఆవరణలో అలాంటి బ్యాగుల గురించి ఆ వర్గం మీడియాలో రాదు. వచ్చిందంటే దాని వెనుక పిచ్చి ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందన్నమాటే!
ఈ క్రమంలో తమకు నచ్చని విశాఖ ఏపీకి ఒక రాజధాని అవుతోందంటే తెలుగుదేశం పార్టీ సహించలేకపోతోంది. అమరావతే రాజధాని, అమరావతి మాత్రమే రాజధాని అంటూ కార్డులు పట్టుకుని తిరుగుతోంది తెలుగుదేశం పార్టీ. రాజధాని మారితే వచ్చే రియలెస్టేట్ నష్టాలకు భయపడి ఈ ఉద్యమం సాగుతోందనేది ఎవరికీ తెలియని విషయం కాదు!
ఈ క్రమంలో విశాఖ మీద లేనిపోనివి ప్రచురించడానికి కూడా వెనుకాడేది లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. విశాఖ తీరంలో సముద్రంలో చీలిక వచ్చిందని, దాని వల్ల భూకంపాలు- సునామీలూ వచ్చేస్తాయని ప్రచారం మొదలుపెట్టారు. ఉన్నట్టుంది ఈ కథనాలు ఎందుకు ఇప్పుడే బయటకు వచ్చాయో పచ్చవారికే తెలియాలి. మరి విశాఖకు అలాంటి ప్రమాదం ఉంటే.. ముందు రామోజీరావు తన ఈనాడు పత్రికాఫీసులను తరలించాలని సోషల్ మీడియాలో సూచనలిస్తున్నారు. అలాగే విశాఖలో ఒక రేంజ్ లో విస్తరించింది తమ కమ్మ వాళ్లే అని ఆ మధ్య అసెంబ్లీలో కొడాలి నాని వివరించారు కదా, వారు కూడా అలర్ట్ కావాలని సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.
ఆ సంగతలా ఉంటే.. విశాఖకు అలాంటి ప్రమాదాలు లేవని సాక్షి కౌంటర్ ఇచ్చింది. ఈనాడు ఒకరిని కోట్ చేస్తూ.. విశాఖ కథ అంతే అని తేలిస్తే, అలాంటి ప్రమాదాలు లేవని.. అసలు సునామీలు, భూకంపాలు వస్తాయనేది అబద్ధమని, వస్తాయో-రావో కూడా తెలియని స్థితి అని.. ఖండాలు ఏర్పడినప్పటి నుంచి ఆ చీలిక ఉండొచ్చని.. దాన్ని పట్టుకుని ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేయడం ఏమిటని సాక్షి ప్రచురించింది. ఈ వాదనను బలపరచడానికి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ శాస్త్రవేత్తల అభిప్రాయాలను ప్రస్తావించింది సాక్షి. ఎక్కడా భూకంపాలు, సునామీలు వచ్చే ప్రాంతాలు మన కోస్తాలో లేవని వారు తేల్చి చెప్పినట్టుగా వివరించింది. ఈనాడు వాదనకు సాక్షి కౌంటర్ సరిపోతుందేమో!