అసలే కరోనాతో భయపడుతున్న పరిస్థితి. ఇది చాలదన్నట్టు ఏలూరులో మరో వింత జబ్బు పుట్టుకొచ్చింది. ఆకస్మికంగా కింద పడిపోవటం, కొందరికి నోటి వెంట నురగలు రావటం, వాంతులు చేసుకోవటం, స్పృహ కోల్పోవటం వంటి లక్షణాలతో జనం తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు.
ఆదివారం సాయంత్రానికి బాధితుల సంఖ్య 286కు చేరింది. అలాగే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యవేక్షణలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బాధితులకు సత్వర వైద్య సేవలందిస్తున్నారు.
ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో పూర్తిగా బాధితుల కోసమే వార్డులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 300 బెడ్స్‌ను సిద్ధంగా ఉంచారు. బాధితుల కండీషన్‌ను బట్టి మెరుగైన వైద్యం కోసం విజయవాడకు కూడా తరలిస్తున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా అక్కడికి వెళ్తున్నారు. అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రులను స్వాధీనం చేసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు.
అయితే దీన్ని కూడా రాజకీయం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ సిద్ధమ య్యారు. అసలే అంతు చిక్కని వ్యాధి అని చెబుతుంటే, దాన్ని కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత అంటూ తండ్రీకొడుకులు విమర్శిస్తుంటే, ఇక వాళ్లను ఏమనాలని పాలక వర్గం ప్రశ్నిస్తోంది.
ఏలూరులో వింత వ్యాధితో ప్రజలు బాధపడుతున్న పరిస్థితిలో వారికి మనోధైర్యం కలిగించాల్సిన చంద్రబాబు, అందుకు విరుద్ధంగా ఎలా రాజకీయాలు చేస్తున్నారో తెలుసుకుందాం. ఏలూరు ఘటనపై బాబు విడుదల చేసిన ప్రకటనలో ఏముందంటే…
“ఏలూరులోని అనేక ప్రాంతాల్లో ఆరేళ్ల చిన్నారుల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకూ నోట నురగతో మూర్ఛ వచ్చినట్టు నేలపై పడి కొట్టుకుంటూ విలవిలలాడుతుంటే మొక్కుబడిగా స్పందించడం సరికాదు. 18 నెలలుగా కనీసం తాగునీటి వనరుల శుద్ధికి చర్యలు లేకపోవడం, క్లోరినేషన్ చేయకపోవడం ప్రజారోగ్యంపై వైసీపీ ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి అద్దం పడుతోంది. అచేతనంగా ఉన్న బిడ్డను కాపాడాలంటూ ఆరోగ్యశాఖ మంత్రిని కోరుతున్న చిన్నారి తల్లి సెల్ఫీ వీడియో రాష్ట్ర పరిస్థితుల్ని ప్రతిబింబిస్తోంది” అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే చందాన ప్రజారోగ్యానికి సంబంధించి బాబు రాజకీయాలకు తెరలేపితే, ఆయన తనయుడు ఊరుకుంటారా? ఏకంగా జగన్ సర్కార్‌కు డెడ్‌లైన్ విధించారు. ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టి, బాధితులు త్వరగా ఎక్కడ కోలుకుంటారోననే ఆందోళన లోకేశ్‌లో కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు వ్యాధి ఏంటో తెలియక వైద్యులు తలలు పట్టుకుంటుంటే డెడ్లైన్లు విధించడం అంటే, ఇంత కంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా? రాజకీయాలు చేయడానికి కూడా సమయం, సందర్భం లేదా? ఇలాంటి ప్రశ్నలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి.
ఏలూరులో ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, 24 గంటల్లో చర్యలు తీసుకోకుంటే ఉద్యమం చేపడతామని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి ఆదివారం ఆయన జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు సాంత్వన కలిగించడానికి బదులు భయపెట్టేలా మాట్లాడ్డంపై విమర్శలు వస్తున్నాయి.
ఇలాంటి సమయంలో కూడా రాజకీయాలకు అతీతంగా నాయకులు ప్రవర్తించలేరా? అనే ప్రశ్నలు పౌర సమాజం నుంచి వస్తున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో ఏలూరులో జనం అనారోగ్యానికి గురి అవుతున్నారనే విషయం బాబు, లోకేశ్‌లకు తెలియదా? అన్నీ తెలిసి కూడా క్షుద్ర రాజకీయాలకు పాల్పడ్డం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి.
విజయవాడ నుంచి ప్రత్యేక వైద్య బృందాలు ఏలూరు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. మంచినీటి శాంపిల్స్ టెస్టింగ్ నిర్వ హించగా అన్నీ బాగుండటం, బాధితులకు చేసిన సీటీ స్కాన్, రక్త పరీక్షలు కూడా నార్మల్ అని రావడంతో ఈ వ్యాధి ఎలా వస్తోందనే దానిపై అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలో నేడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ బృందాన్ని కూడా రప్పిస్తున్నారు.
కానీ చంద్రబాబు, లోకేశ్‌లోని రాజకీయ వింత జబ్బుపై పరిశోధనలు చేయాలి. ఆ జబ్బుకు తగిన ట్రీట్మెంట్ ఇస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఆరోగ్యకరమైన రాజకీయాలకు అవకాశమే ఉండదు. ఎన్నికలప్పుడంటే రాజకీయాలు తప్పదు.
సాధారణ రోజుల్లో, అది కూడా విపత్కర పరిస్థితులను రాజకీయ లబ్ధికి వాడుకోవాలనే తండ్రీకొడుకుల వింత జబ్బుకు మాత్రం ఓ పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.