యువకుడు, ఉజ్వల భవిష్యత్ ఉన్న నాయకుడిగా ప్రత్యర్థుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఒకే ఒక్క ప్రకటనతో రాజకీయ విశ్లేషకులు, నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
అధినేత మెప్పు కోసం మరీ ఇంత పచ్చి అబద్ధాలా అని ప్రశ్నిస్తున్నారు. అసలే టీడీపీ అధినేత చంద్రబాబు మాటలకు, చేతలకు అర్థాలే వేరులే అనే అభిప్రాయం తెలుగు సమాజంలో స్థిరపడింది. ఎంతో భవిష్యత్ ఉన్న రామ్మోహన్‌నాయుడు కూడా అధినేత బాటలో ప్రయాణిస్తూ విమర్శలపాలవుతున్నారు.
ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై వైసీపీ ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. లోక్‌సభలో ఒకలా, బయట మరోలా మాట్లాడేది వైసీపీనే తప్ప టీడీపీ కాదని ఆయన విమర్శించారు. బిల్లులపై చర్చించే సమయంలో లోక్‌సభలో వైసీపీ ఎంపీలు నిద్రపోయారేమో , వైసీపీ ప్రభుత్వ తీరు రైతుల పాలిట శాపంగా మారిందని ఆయన విమర్శించారు.
కొత్త వ్యవసాయ బిల్లులతో రైతులు నష్టపోతారని లోక్‌సభలో ఆ రోజే చెప్పామని ఆయన పేర్కొన్నారు. రామ్మోహన్‌నాయుడి ప్రకటన చూసిన వాళ్లు ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు. వామ్మో…రామ్మోహన్‌నాయుడు అంటూ అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఇదే రామ్మోహన్‌నాయుడు పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లులపై మాట్లాడిన దానికి, ఇప్పుడు చెబుతున్న దానికి పూర్తి విరుద్ధం.
మూడు సాగు బిల్లులకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ఆయన నిండు పార్లమెంట్ సభలో ప్రకటించారు. అంతేకాదు, ఆ బిల్లుల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. బిల్లులో ప్రతిపాదించిన ఇ-ప్లాట్‌ఫాం ఎంతో బాగుందని కూడా మోడీ సర్కార్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.
ప్రత్యామ్నాయ మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు మంచిదంటూ వ్యవసాయ బిల్లులను ఆయన స్వాగతించారు. ఇప్పుడు మూడు వ్యవసాయ బిల్లులను వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినట్టు విమర్శిస్తుండడం గమనార్హం. మూడు వ్యవసాయ బిల్లులను మూడు రాజధానుల బిల్లులనుకుంటున్నారా? అని నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు.