ప్రశ్నించడానికే పార్టీ అన్నాడు. సమాజాన్ని సమూలంగా మారుస్తానన్నాడు. 25 ఏళ్ల రాజకీయ ఎజెండా అన్నాడు. ఇలా ఎన్నెన్నో స్ఫూర్తిదాయక పంచ్ డైలాగ్‌లతో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ జనసేనానిగా మన ముందుకొచ్చాడు. లేట్‌గా వచ్చినా …లేటెస్ట్‌గా వచ్చాడులే అని అందరూ అనుకున్నారు. జనం ఆశించింది వేరు, జనసేనాని చేసింది వేరు.
తాను ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు చీలి జగన్ లాభపడతాడంటూ టీడీపీ-బీజేపీ కూటమికి 2014 సార్వత్రిక ఎన్నికల్లో మద్దతు పలికాడు. ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి విజయం సాధించడానికి పవన్ మద్దతు కూడా కలిసొచ్చింది. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మోడీ సర్కార్ అన్యాయం చేసిందంటూ విమర్శలు చేశాడు. టీడీపీ -బీజేపీ కూటమితో విభేదించాడు.
2019 ఎన్నికల్లో వామపక్షాలతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల క్షేత్రంలో తలపడ్డాడు. కేవలం ఒక్క సీటుతో సరిపెట్టు కున్నాడు. చివరికి తాను పోటీ చేసిన రెండు చోట్ల గెలుపొందలేకపోయాడు. ఆ తర్వాత వామపక్షాలకు గుడ్‌బై చెప్పి కమలం నీడలో కుదురుకున్నాడు. ఊరందరిది ఒక దారి ఐతే ఉలిపి కట్టెది ఇంకొక దారి అనే చందంగా పవన్‌కల్యాణ్ రాజకీయ పంథా ఉంది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలంటూ దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రాజకీయా లకు అతీతంగా రైతులు తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్నారు.
అయితే ఆ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు అన్నట్టు పవన్ కల్యాణ్ ఈ నెల 7న దీక్ష చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 8న భారత్ బంద్‌కు రైతులు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు భారీగా మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి ప్రియాంక చోప్రా స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
మన రైతులు దేశ ఆహార సైనికులని ఆమె అన్నారు. వారి భయాలను తొలగించి, వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభం త్వరలో పరిష్కారమవుతుందనే నమ్మకం కలిగించాలని ఆమె మోడీ సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు.
రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ప్రియాంక చోప్రా నిబద్ధత కూడా మన పవన్ కల్యాణ్‌లో కనిపించకపోవడం విశేషం. బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతున్న జనసేనాని, రాజకీయాల కోసం తప్పుల్ని కూడా ప్రోత్సహించే స్థాయికి చేరుకోవడమే ఆయన్ను పదేపదే ప్రశ్నించేలా చేస్తోంది.