దేశవాళీలో ఎంతగా సత్తా చాటిన బౌలర్ అయినా.. తన తొలి తొలి అంతర్జాతీయ మ్యాచ్ లలో ధారాళంగా పరుగులు ఇస్తూ ఉంటారు. అప్పటి వరకూ దేశవాళీలో అరివీర భయంకరులు అని పేరు తెచ్చుకున్న వాళ్లు కూడా అంతర్జాతీయ వేదికల మీద బేలగా మారిపోతూ ఉంటారు.
జాతీయ జట్టుకు ఆడటం అనే కల నెరవేరిన వేళ వారి పై ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. వేల మంది ప్రేక్షకులు స్టాండ్స్ లో ఉండటం, నిరూపించుకోవాలనే ఒత్తిడి, సత్తా చూపించాలనే తపన.. వెరసి బాల్ వారి చేతి నుంచి జారుతు ఉంటుంది.
ప్రత్యేకించి వన్డే క్రికెట్ తో కెరీర్ ను ప్రారంభించే బౌలర్లపై ఈ విపరీత ఒత్తిడి ఉంటుంది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో బ్యాట్స్ మన్ విరుచుకుపడితే కొత్త బౌలర్ల పరిస్థితి మరింత బేలగా మారిపోతుంది. ప్రత్యేకించి టీమిండియా తరఫున తొలి తొలి అంతర్జాతీయ మ్యాచ్ లలోనే అద్భుతంగా బౌలింగ్ చేసిన వారు అరుదు!
గత కొన్నేళ్లలో జహీర్, ఇషాంత్, బుమ్రా వంటి వాళ్లు మాత్రమే ఆరంభంలోనే ఆకట్టుకోగలిగారు. వీరిలో ఇషాంత్ తొలి మ్యాచ్ లలో ధారళంగా పరుగులిచ్చాడు. అయితే టెస్టుల్లో తన సత్తా చూపించాడు. బుమ్రా మొదట్లో నోబాల్స్ తో నియంత్రణ కోల్పోయేవాడు.
చాన్నాళ్ల తర్వాత ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఆరంభంలోనే ఆకట్టుకుంటున్నాడు. అతడే నటరాజన్. ఈ తమిళనాడు బౌలర్.. అక్కడ జరిగి టీ20 లీగ్ ల ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఇటీవలి ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ తరఫున బరిలోకి దిగి ఆకట్టుకున్నాడు. ఆ వెంటనే జాతీయ జట్టులోకి అవకాశం లభించింది. వన్డే సీరిస్ లో ఆఖరి మ్యాచ్ తో కెరీర్ మొదలు పెట్టిన నటరాజన్ తొలి మ్యాచ్ లోనే చూడచక్కగా బౌలింగ్ వేశాడు.
తన మీద పెట్టుకున్న అంచనాలకు న్యాయం చేశాడు. ఒక వైపు మిగతా బౌలర్లు గాడి తప్పిన వేళ నటరాజన్ మాత్రం ఆకట్టుకుంటూ ఉండటమే మరింత విశేషం. నిన్నటి సిడ్నీ టీ20 మ్యాచ్ లో అయితే ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్లు కూడా బ్యాట్స్ మన్ ను నియంత్రించలేకపోయారు! సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో బోలెడన్ని టీ20 మ్యాచ్ లు ఆడిన ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు 194 పరుగుల టార్గెట్ ను కూడా కాపాడుకోలేకపోయారు. ఇక భారత బౌలర్లు అయితే సరేసరి!
అసలు బౌలింగ్ కు ఏ మాత్రం అనుకూలంగా లేని పిచ్ మీద నాలుగు ఓవర్లు వేసి 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు నటరాజన్. రెండు వికెట్లు కూడా తీశాడు. సీనియర్లు, ఆస్ట్రేలియన్ బౌలర్లు కూడా బాల్ పై నియంత్రణ కోల్పోయిన చోట నటరాజన్ కట్టుదిట్టమైన టీ20 ఫాస్ట్ బౌలింగ్ ఎలా ఉంటుందో చూపించాడు.
సూపర్ ఫాస్ట్ బౌలర్ కాకపోయినా, స్వింగ్- రివర్స్ స్వింగ్ అనే విశ్లేషణలు లేకపోయినా.. తెలివిగా బౌలింగ్ వేస్తూ ఆరు బంతులనూ యార్కర్లుగా వేయగల సత్తాతో అంతర్జాతీయ కెరీర్ ను గొప్పగా ఆరంభిస్తున్నాడు. ఇదే రీతిన కొనసాగితే రానున్న టీ20 ప్రపంచకప్ కు టీమిండియాకు నిఖార్సైన ఫాస్ట్ బౌలర్ లభించినట్టే!