గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముచ్చట ముగిసినా.. మేయర్ పీఠం ఎన్నికపై పీటముడి పడేలా ఉంది. అతి పెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ కి ఎక్స్ అఫిషియో సభ్యుల్ని కలుపుకున్నా కూడా మెజార్టీ కనపడ్డంలేదు. దీంతో ఎంఐఎం మద్దతు ఆ పార్టీకి తప్పనిసరిగా మారింది. అటు ఎంఐఎం కూడా స్నేహ హస్తం అందించడానికి సిద్ధంగానే ఉంది.
గ్రేటర్ లో టీఆర్ఎస్ కి 55సీట్లు దక్కాయి. ఓపెన్ కేటగిరీలో 150 డివిజన్లలో 76 డివిజన్లు గెలిచిన పార్టీదే మేయర్ పీఠం. టీఆర్ఎస్ సహా బీజేపీ, ఎంఐఎం కి అది అసాధ్యం. పోనీ ఇక్కడ ఎక్స్ అఫిషియోలను కూడా కలుపుకుందామనుకుంటే.. 150కి మరో 53 కలిపితే ఎలక్టోరల్ కాలేజీ సంఖ్య 203కి చేరుతుంది. అంటే అప్పుడు 102మంది సభ్యుల మద్దతు అవసరం.
55 డివిజన్లు గెలుచుకున్న టీఆర్ఎస్ కి కేవలం 38మంది ఎక్స్ అఫిషియో సభ్యుల బలం మాత్రమే ఉంది. అంటే.. మొత్తంగా టీఆర్ఎస్ 93 దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. కొత్తగా ఎన్నికైన వారికి ఓటు హక్కు నమోదు చేయించినా కూడా మహా అయితే 5 సీట్లు పెరుగుతాయి. అప్పుడు కూడా 98 దగ్గర ఆగాల్సిందే.
అంటే టీఆర్ఎస్ కి ఎంఐఎం మద్దతు మినహా ఇంకో అవకాశమే లేదు. నేరుగా ఎంఐఎం మద్దతు కోరడం ఒకటి, పరోక్షంగా ఎంఐఎంను ఎన్నికవేళ దూరంగా ఉంచడం ఇంకోటి. ఈ రెండు పద్ధతుల్లో దేనిని ఎంచుకున్నా టీఆర్ఎస్ కి మేయర్ పీఠం దక్కుతుంది. ఇప్పటి వరకూ అందరూ ఇదే జరుగుతుందని అనుకున్నారు.
టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎంఐఎం మద్దతుతో అధికారాన్ని చేజిక్కించుకుంటామనే అంచనాలో ఉన్నారు. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కేసీఆర్ సరికొత్త ఎత్తుగడ వేశారు. పైన చెప్పుకున్న రెండు విధానాల్లో దేన్ని ఫాలో అయినా ఎంఐఎంతో టీఆర్ఎస్ ములాఖత్ బట్టబయలవుతుంది.
అందుకే మధ్యే మార్గంగా బీజేపీని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు. మేయర్ బరిలో ఎంఐఎంని కూడా నిలిచేలా చేస్తున్నారు. అవును… టీఆర్ఎస్ కి పోటీగా ఎంఐఎం కూడా తన అభ్యర్థిని నిలబెడితే.. బీజేపీ పోటీనుంచి తప్పుకోవడం మినహా చేయగలిగిందేమీ లేదు.
సో.. అప్పుడు సభలో ఉన్న హాజరు ప్రకారం సగానికి పైగా సీట్లు సాధించిన టీఆర్ఎస్ కే మేయర్ పీఠం దక్కుతుంది. ఇటు ఎంఐఎంతో బహిరంగ పొత్తు అపవాదు లేకుండా చేసుకోవడం, అటు బీజేపీని తనకు తానుగా పారిపోయేలా చేయడం. ఈ రెండూ ఒకేసారి జరిగేలా కేసీఆర్ వ్యూహ రచన చేశారు. మేయర్ ఎన్నికరోజు బీజేపీకి షాక్ ఇవ్వబోతున్నారు.