గత ప్రభుత్వంలో చంద్రబాబు తెలిసి చేసిన తప్పులు ఇప్పుడు జగన్ కు తిప్పలుగా మారుతున్నాయి. విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తే.. దాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా మలుచుకుంది. కేంద్రం చేసిన చట్టాన్ని రాష్ట్రానికి అనుకూలంగా పునర్ నిర్వచించింది. 5 శాతం కేవలం కాపులకు, 5శాతం కాపులు మినహా ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాలకు కేటాయించింది.
ఓ రకంగా ఇది కాపులకు మేలుచేసే విషయమే, అయితే న్యాయపరమైన చిక్కులు ఎదురైతే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చెల్లదు. ఈ విషయం తెలిసి కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 10శాతాన్ని తనకి నచ్చినట్టుగా విడగొట్టింది. ఇటీవల అసెంబ్లీలో కూడా ఈ వివాదం తెరపైకి వచ్చినప్పుడు జగన్ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటూ వితండవాదం చేసింది టీడీపీ. కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జగన్ సర్కార్ కు ఇష్టంలేదని చెప్పుకొచ్చింది.
కానీ సీఎం జగన్ మాత్రం తన నిర్ణయానికి కట్టుబడే ఉన్నారు. కేంద్రం 10శాతం రిజర్వేషన్లను ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు కేటాయించింది. దీన్నే తాను అమలు చేస్తానని చెప్పుకొచ్చారు సీఎం. న్యాయపరమైన చిక్కులు వస్తే కాపులకు 5శాతం రిజర్వేషన్లు చెల్లవని ఆయన కుండబద్దలు కొట్టారు. జగన్ చెప్పినట్టే జరిగింది. కోటాలో సబ్ కోటాను అప్పటి రాష్ట్రప్రభుత్వం కాపులకు ఎలా ఇస్తుందని కొంతమంది సుప్రీంకోర్టుకు, మరికొంతమందికి హైకోర్టుకు వెళ్లారు.
దీనిపై పిటిషనర్ల వాదన సమర్థిస్తూ తుది తీర్పుకు లోబడి ప్రవేశాలు కల్పించాలని చెప్పింది హైకోర్టు. దీంతో రాష్ట్రప్రభుత్వం కూడా 10శాతం పూర్తి రిజర్వేషన్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇవ్వాలని జీవో జారీచేసింది. ఈ జీవోతో ఒకరకంగా కాపులు అసంతృప్తికి గురైనమాట వాస్తవమే అయినా, ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు ఇది న్యాయంచేసే నిర్ణయమే అని తేలుతోంది. అయితే ఇక్కడ కోర్టు తీర్పు కంటే జగన్ సర్కారు నిర్ణయాన్నే టీడీపీ తప్పుబడుతోంది.
కాపులకు 5శాతం రిజర్వేషన్లను జగన్ సర్కారు వ్యతిరేకిస్తోందని టీడీపీ ప్రచారం చేస్తోంది. కాపులను రెచ్చగొడుతోంది. వాస్తవానికి కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం జీవో జారీ చేసిందే తప్ప కాపులపై ద్వేషంతో చేసింది మాత్రంకాదు. న్యాయస్థానాల్లో చిక్కులు ఎదురవుతాయని తెలిసి కూడా నాటి సీఎం చంద్రబాబు చేసిన తప్పులు, ఇప్పటి సీఎం జగన్ కి తలనొప్పిగా మారుతున్నాయి.