ఏదైనా అంశం కేంద్ర పరిధిలోకి వస్తుందంటే చాలు బాబు తన 40 ఏళ్ల అనుభవాన్ని రంగరించి ఫీలర్లు వదులుతూనే ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తారనే ఊహాగానాల మధ్య బాబు తన మీడియాను బాగానే వాడుతున్నారు.
మరీ ముఖ్యంగా కొడుకు లోకేష్ పదవి ఊడిపోతుందనే భయంతో ఉన్న బాబు, మీడియాను ఎన్నిరకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకుంటున్నారు. కింద కొన్ని మీడియా (బాబు మీడియా) స్టేట్ మెంట్స్ చూద్దాం
మండలి రద్దుపై అమిత్ షాకు ఫోన్ చేసిన బాబు
మండలి రద్దుపై జాతీయ నాయకుల్ని కలిసే యోచనలో బాబు
మండలి రద్దుకు నిరసనగా ఢిల్లీకి వెళ్లనున్న బాబు
చూశారుగా.. ఇవి కొన్ని మాత్రమే. గడిచిన 3 రోజులుగా ఇలాంటి స్టేట్ మెంట్స్ పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. అక్కడికి బాబు రాక కోసం మోడీ-అమిత్ షాతో పాటు జాతీయ స్థాయి నేతలంతా ఎర్రతివాచీ పరిచి సిద్ధంగా ఉన్నట్టు ఇక్కడ అతడి మీడియా వార్తలు వండి వార్చేస్తోంది. దౌర్భాగ్యం ఏంటంటే.. ఏబీఎన్-టీవీ5లో అవే హెడ్ లైన్స్ కూడా.
నిజంగానే బాబు అమిత్ షాకు ఫోన్ చేశారా. చేశారనే అనుకుందాం, బాబు మాట అమిత్ షా వింటారా. జాతీయ స్థాయి నాయకుల్ని బాబు కలుస్తారనే అనుకుందాం, ఈ విషయంలో ఎంతమంది నేతలు బాబుతో కలిసి ముందుకొస్తారు. ఢిల్లీ వెళ్లి నిరసన తెలుపుతారనే అనుకుందాం, అక్కడికెళ్లి ధర్నా చేస్తే ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు వీటికి వివరణలు చూద్దాం.
బీజేపీ-టీడీపీ మధ్య సంబంధాల గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి టైమ్ లో అమిత్ షా కర్టసీ కొద్దీ బాబుతో మాట్లాడతారేమో కానీ మండలి రద్దుపై ఎలాంటి హామీ ఇవ్వరు. ఇక ప్రధాని మోడీ అయితే అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరు. ఇక జాతీయ స్థాయి నేతల విషయానికొస్తే.. దేశంలో శాసనమండళ్లు అమల్లో ఉన్నదే అతికొద్ది రాష్ట్రాల్లో. ఉన్న 4 రాష్ట్రాల్లో కూడా ఇవే సమస్యలున్నాయి. మరి అలాంటప్పుడు ఇతర నేతలు ఎందుకు ముందుకొస్తారు.
ఇక మూడో విషయానికొద్దాం. బాబు స్వయంగా ఢిల్లీ వెళ్లి ధర్నాకు కూర్చున్నారని అనుకుందాం. అంతకంటే బుద్ధి తక్కువ విషయం మరొకటి లేదు. మండలి రద్దు అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. రద్దును వ్యతిరేకిస్తూ ఏదైనా చేయాలనుకుంటే రాష్ట్రంలోనే చేయాలి. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన తర్వాత, అప్పుడు బాబు ఢిల్లీ వెళ్లి ధర్నా చేసి ఉపయోగం ఉండదు. ఎందుకంటే, రూల్స్ ప్రకారం ఇప్పటికిప్పుడు కాకపోయినా, ఏడాదిన్నర తర్వాతైనా మండలి రద్దయిపోతుంది.
ఇవన్నీ బాబు మీడియాకు తెలియని విషయాలు కావు. కానీ అలా రాస్తుంటాయి, అవే చూపిస్తుంటాయి. జనాల్ని పిచ్చోళ్లని చేసే కార్యక్రమాన్ని అలా కొనసాగిస్తూనే ఉంటాయి. కానీ ఇలాంటి రాతలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని అవి భావిస్తే మాత్రం అంతకంటే భ్రమ ఇంకోటి ఉండదు.