ఐదేళ్ల క్రితం ఏర్పాటైన రాజధాని అమరావతి పునాదులు కదులుతున్నాయి. ‘క్యాపిటలిస్టు’ల గుండెల్లో రైళ్లు పరుగెడు తున్నాయి. కొత్త పరిపాలన రాజధాని విశాఖ వైపు పరుగెడుతోంది. అమరావతి నుంచి విశాఖ వైపు రాజధాని వెళ్లడానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా విధానాలే కారణమనేందుకు అనేక నిదర్శనాలున్నాయి. బాబు నియంతృత్వ పునాదులపై నిర్మితమైన అమరావతి రాజధాని త్వరలో చరిత్రలో కలిసిపోనుంది.
నాల్గో శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త ప్లేటో చెప్పిందాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ‘ఏ నగరమైనా అదెంత చిన్నదైనా వాస్తవానికి రెండుగా విభజించబడి ఉంటుంది. ఒకటి పేదల నగరం. రెండు ధనికుల నగరం. ఈ రెండూ ఎప్పుడూ ఒకదానితో ఒకటి పోరాడుతూ ఉంటాయి’ అని వందల సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు నాడు రాజధాని ఏకపక్ష ఎంపిక, నేడు విశాఖ, కర్నూల్‌కు తరలింపునకు అద్దం పట్టాయి.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ -6 ప్రకారం భారత ప్రభుత్వం ఏపీ రాజధాని స్థలాన్ని నిర్ణయించడానికి, ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి 2014లో నాటి యూపీఏ-2 ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. అయితే రాజధాని ఎంపిక అధికారం రాష్ట్రం చేతిలో ఉండడం, శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను నాటి చంద్రబాబు సర్కార్ చెత్తబుట్టలో పడేయడం వల్లే నేడు రాజధాని అగ్గిని రాజేసింది.
ప్లేటో చెప్పినట్టు చంద్రబాబు కలల రాజధాని అమరావతి ధనిక నగరంగా, మిగిలిన ప్రాంతాలు ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు పేదల ప్రాంతాలు విభజింపబడ్డాయి. ఈ రెండింటి మధ్య ఆర్థిక అసమానతలే నేడు రాజధానుల ఏర్పాటుకు దారి తీశాయని చెప్పొచ్చు.
రాజధాని స్థల ఎంపిక కోసం శివరామకృష్ణన్ కమిటీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంది. అయితే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా శివరామకృష్ణన్ కమిటీ పనిచేయడం లేదని గ్రహించారు. అధికారంలోకి రాక ముందునుంచే బాబు మనసంతా అమరావతి, గుంటూరు, విజయవాడ చుట్టే పరిభ్రమిస్తూ ఉండేది. ఆ ప్రాంతాలకు సమీపంలోనే రాజధాని పెట్టాలని బాబు అండ్ కో ముందస్తు ప్రణాళికలతో సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో శివరామకృష్ణన్ కమిటీ ఒకవైపు పర్యటిస్తుండగానే, బాబు సర్కార్ పురపాలకశాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో రాజధాని ఎంపిక కమిటీ వేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలను శివరామకృష్ణన్ కమిటీ పసిగట్టింది.
శివరామకృష్ణన్ కమిటీలో నిపుణులు
యూపీఏ-2 ప్రభుత్వం శివరామకృష్ణన్ చైర్మన్‌గా మరికొంత మంది నిపుణులను సభ్యులుగా నియమిస్తూ కమిటీ వేసింది. ఈ కమిటీలోని శివరామకృష్ణన్ భారత ప్రభుత్వంలో పట్టణాభివృద్ధిశాఖకు మాజీ కార్యదర్శి. ఈయనకు పట్టణాల నిర్మాణంలో అనుసరించాల్సిన విధివిధానాలపై మంచి పట్టు ఉంది. ఈ కమిటీలోని మిగిలిన సభ్యులు కూడా ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్నవారే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డైరెక్టర్ డాక్టర్ రతిన్‌రాయ్ , నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ అర్బన్ ఎఫైర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జగన్‌షా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ డైరెక్టర్ అరోమార్ రవి, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మాజీ డీన్ ప్రొఫెసర్ రవీంద్రన్ ఈ కమిటీలో ఉన్నారు.
వ్యాపారవేత్తలతో బాబు సర్కార్ కమిటీ
తమ ఇష్టానికి అనుగుణంగా రాజధానిని ఎంపిక చేయాలనే కుట్రతో చంద్రబాబు సర్కార్ …నిపుణుల కమిటీని కాదని మంత్రి నారాయణ నేతృత్వంతో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. 2014, ఆగస్టు 31లోపు శివరామకృష్ణ కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉండింది. అంతకు ముందే జూలై 21న మంత్రి నారాయణ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి, తెలుగుదేశం నేత (వ్యాపారి) బీద మస్తాన్‌రావు, పారిశ్రామిక వేత్తలు సంజ య్‌రెడ్డి, శ్రీనివాస్ శ్రీనిరాజు, ప్రభాకర్రావులతో చంద్రబాబు సర్కార్ రాజధాని అధ్యయన కమిటీని వేసింది.
రెండు కమిటీలకు తేడా
శివరామకృష్ణన్ కమిటీలో వివిధ రంగాల్లో నిపుణులైన సభ్యులున్నారు. వారికి పట్టణాభివృద్ధి, పర్యావరణం, వ్యవసాయం…ఇలా అన్ని రంగాల్లో మంచీచెడుల గురించి అధ్యయనం చేసి ప్రజలకు ఎలాంటి నగరం లాభదాయకమో, సౌకర్యవంతమో చెప్పగలిగే శక్తిసామర్థ్యాలున్నాయి. ఇదే నారాయణ కమిటీలో ఉన్నవారంతా వ్యాపారవేత్తలే. వీరికి లాభనష్టాలతో తప్ప ప్రజలతో పనిలేదు. నారాయణ కార్పొరేట్ విద్యా వ్యాపారి, గల్లా జయదేవ్ బ్యాటరీస్, ఇతరత్రా అనేక వ్యాపారాలు, సుజనాచౌదరికి బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టిన ఘనత ఉండనే ఉంది. మిగిలిన వారు కూడా పారిశ్రామికవేత్తలేనని నాటి ప్రభుత్వమే చెప్పింది.
హరితక్షేత్రంలో రాజధాని వద్దని….
చంద్రబాబు ప్రభుత్వానికి శివరామకృష్ణన్ కమిటీ పలు సిఫార్సులు చేసి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించింది. ప్రధానంగా కొత్త రాష్ట్రానికి కేంద్రీకృతమైన హరితక్షేత్ర నగరం సరైంది కాదని స్పష్టం చేసింది. ఇప్పుడు జీఎన్‌రావు, బోస్టన్ నివేదికలు కూడా అమరావతి సరైన రాజధాని కాదని తేల్చడం గమనార్హం. అలాగే రాజధాని కార్యకలాపాలను భిన్నమైన స్థలాలకు పంపిణీ చేయాలని సూచించింది. వ్యవసాయానికి, పర్యావరణానికి అతి తక్కువ నష్టం జరగాలని, రాజధాని నిర్మాణానికి ప్రభుత్వంపై తక్కువ ఆర్థిక భారం పడాలని సిఫార్సు చేసింది.
ప్రైవేట్, స్పెక్యులేటివ్ పెట్టుబడినంతా ఈ రాజధాని ప్రాంతమే రాబట్టుకుంటుందని కమిటీ హెచ్చరించింది. ప్రభుత్వ కార్యకలాపాలను తమకిష్టమైన ఒకట్రెండు ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో చంద్రబాబు సర్కార్ వ్యవహార శైలిపై కొన్ని ప్రాంతాల ప్రజలకు, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు కొన్ని భయాలున్నట్టు కమిటీ గుర్తించింది. గుంటూరు-విజయవాడ మధ్య అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గుంటూరు-విజయవాడ మధ్య అభివృద్ధి కేంద్రీకరించడం వల్ల ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయని శివరామకృష్ణన్ కమిటీ హెచ్చరించింది.
శివరామకృష్ణన్ నివేదికలో వైజాగ్ ప్రస్తావన
శివరామకృష్ణన్ కమిటీ అనేక అంశాలు, ప్రాంతాలపై అధ్యయనం చేసి చంద్రబాబు సర్కార్‌కు నివేదించింది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటుపై కూడా సమగ్ర అధ్యయనం చేసింది. వైజాగ్‌లో హైకోర్టు పెట్టాలని నివేదికలో పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం జీఎన్ రావు, బోస్టన్ నివేదికలు కూడా విశాఖలో పరిపాలన రాజధాని పెట్టాలని సూచించడం మరింత ప్రాధాన్యం సంతరించుకొంది. అలాగే తక్కిన కార్యాలయాలను మూడు భిన్న ప్రాంతాలకు తరలించడం మంచిదని శివరామకృష్ణన్ కమిటీ ఎంతో ముందు చూపుతో సూచించింది.
బాబు సర్కార్ సహాయ నిరాకరణపై కమిటీ అసంతృప్తి
రాజధాని, ఇతరత్రా అంశాలపై అధ్యయనంలో భాగంగా శివరామకృష్ణన్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. ఈ విషయమై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తన అసంతృప్తిని నివేదికలో కూడా పేర్కొనడం గమనార్హం.
అర్బన్ కాంక్రీట్ జంగల్
‘రాష్ట్ర ప్రభుత్వం సుమారు 54 వేల ఎకరాలను సేకరించింది. వీటిలో దాదాపు 15 వేల ఎకరాలు చాలా సారవంతమైనవి. ఈ భూముల్లో దాదాపు వంద రకాల పంటలు పండించేవాళ్లు. మిగిలిన భూముల్లో ఒకట్రెండు పంటలు పండించేవాళ్లు. అమరావతిలో రాజధాని నిర్మాణం అంటే అర్బన్ కాంక్రీట్ జంగల్ నిర్మాణమే’ అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాజీ సీఎస్ ఐవైఆర్ రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ అనే పుస్తకానికి రాసిన ముందుమాటలో చెప్పారు.
రాజధానిపై బాబు కన్ను-లోపించిన దూరదృష్టి
హిందూ పత్రికలో 2014, ఆగస్టు 15న శివరామకృష్ణన్ ‘రాజధానిపై కన్ను-లోపించిన దూరదృష్టి’ అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు. అందులో ఆయన ఏమన్నారంటే… ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ఆంధ్రప్రదేశ్‌ను ఎదుర్కొంటున్న పెద్దసమస్యలపై కేంద్రీకరించడానికి శ్రీ ఎన్.చంద్రబాబునాయుడుకు చాలా సమయం ఇస్తున్నది. ఆయన ఈ సమస్యలపై దృష్టి పెట్టే బదులు రాజధానికి స్థల సేకరణ కోసమే ఆలోచించడంలోనే కూరుకుపోయినట్టు కనిపిస్తూ ఉంది.
దురదృష్టవశాత్తూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అభివృద్ధి విషయంలో విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతంలో అమరావతి అని పిలవబడే ప్రాంతం పూర్తిగా ఆయన్ని వశపరచుకున్నట్టునిపిస్తోంది. శ్రీనాయుడి గారి ప్రతిభాపాటవాలను ఉపయోగించుకుని ,కనీసం రాబోయే సంవత్సరాల్లోనైనా రాష్ట్రం ముందున్న ప్రాధమ్యాలను గుర్తించినట్టైతే బాగుంటుంది. విషయం మహత్తరమైన రాజధాని నగరం కాదు, అది తర్వాత ఎప్పుడైనా రావచ్చు. ప్రస్తుతం ముఖ్యమైనది ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌కు రాజకీయ శక్తిని, ఆర్థిక వనరులను ఈ రాజధాని ప్రాజెక్టుకు తాకట్టు పెట్టే దాదాపు ఆత్మహత్యా సదృశ్యమైన పని పనికి రాదు’ అని శివరామకృష్ణన్ ఎంతో ముందు చూపుతో చంద్రబాబు సర్కార్‌నే హెచ్చరించారు.
‘క్యాపిటలిస్టు’ల కలల రాజధాని విధ్వంసం
కేవలం క్యాపిటలిస్టులంతా కలిసి నిర్ణయించిన, నిర్మిస్తున్న రాజధాని అమరావతి విధ్వంసానికి గురవుతోంది. దీనికి కారణం చంద్రబాబు సర్కారే అని చెప్పక తప్పదు. ఐదు వేళ్లూ చంద్రబాబు వైపు చూపాల్సి వస్తోంది. నియంతృత్వ పోకడలతో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి తాను, తనను నమ్ముకున్న వ్యాపారవేత్తలు, ఆ ప్రాంతంలోని తన సామాజికవర్గీయులతో ఆర్థిక సామ్రాజ్యాన్ని నెలకొల్పాలనుకున్న చంద్రబాబు కలలు కల్లలయ్యే రోజులకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఆ రోజు శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని ఉంటే…ఇప్పుడు ఈ దుస్థితి వచ్చేది కాదన్నది నగ్నసత్యం.