కండువాల మార్పిడి ఉండదు. జగన్ సర్కార్ పాలన నచ్చి వైసీపీలో చేరామనే ప్రకటనలు ఉండవు. కేవలం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలవడం, పుష్ప గుచ్చాలు ఇవ్వడం, తమ నియోజక అభివృద్ధి కోసం నిధులు కోరడం…ఇదీ టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికార వైసీపీ షాక్ ఇచ్చే విధానం. దీన్నే జగన్ మార్క్ జంపింగ్ లేదా ఆకర్ష్ అంటారు.
తాజాగా టీడీపీ మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. గతంలో 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకుని బలహీన పర్చాలని చూసిన టీడీపీని దెబ్బకు దెబ్బ తీయాలని వైసీపీ పెద్దలు వ్యూహ రచన చేస్తున్నారని సమాచారం. ఈ మేరకు వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది.
ఈ నేపథ్యంలో టీడీపీకి డబుల్ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ సర్కార్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఈ వేళ సాయంత్రం సీఎం జగన్‌ను కలిసి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.
ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు జిల్లా పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీ ప్రభుత్వ అనుకూల ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో ప్రత్యేక సీట్లను కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ జాబితో మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా చేరనున్నారు.
అసెంబ్లీ టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే లోపు బాబు ప్రతిపక్ష హోదాకు గండి పడేలా ఉంది. అసెంబ్లీలో పది శాతం సీట్లు సాధిస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అంటే 175 అసెంబ్లీ సీట్లున్న ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 18 సీట్లు ఉండాలి.
ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుతో వైసీపీ సర్కార్‌కు అనుకూలంగా ఉన్న వాళ్ల సంఖ్యకు ఐదుకు చేరుతుంది. టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 23 నుంచి 18కి పడిపోతుంది. అంటే మరో ఎమ్మెల్యేని ఆకర్షించగలిగితే బాబుకు ప్రతిపక్ష హోదా పోయినట్టే. అందులో భాగంగానే జగన్ ఈ సర్కార్ తన మార్క్ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపినట్టు తెలుస్తోంది. మున్ముందు రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి.