తప్పో ఒప్పో తాను అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ పోయే రకం జగన్. ఇంగ్లిష్ మీడియం కుదరదని కోర్టులు చెబుతున్నా.. తల్లిదండ్రుల ఒప్పంద పత్రాలు తీసుకుని మరీ రెడీ అవుతున్న వ్యక్తి జగన్. రంగులెందుకు వేస్తున్నారని ప్రశ్నిస్తే.. కొత్తరంగు కలుపుతాం కానీ, పాతరంగు తీసేది లేదని ఖరాఖండిగా చెప్పిన మనిషి. పేదలకు ఇచ్చే స్థలాల విషయంలో కుట్ర రాజకీయాలు చేస్తున్నా వెనకడుగేయకుండా ముందుకే వెళ్తున్న ధైర్యవంతుడు. మూడు రాజధానులకు, అభివృద్ధి నిర్ణయాలకు అడుగడుగునా అడ్డుపడుతున్న మండలిని ఏకంగా పీకిపారేసిన ఘనుడు. ఇలా అన్నిటిలో మొండివాడుగా పేరుతెచ్చుకున్న జగన్, టీటీడీ ఆస్తుల అమ్మకంపై మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు.
అయితే అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగింది. టీడీపీ హయాంలో ఏం జరిగిందో, అప్పుడెలా చేశారో ప్రజలకు అవసరం లేదు, అసలిప్పుడు ఎందుకు ఆస్తులు అమ్మాల్సి వస్తోందనేదే వారి ప్రశ్న. పెద్దగా విలువలేని చిన్న చిన్న స్థలాలకు కాపలా పెట్టడం కంటే, వాటిని అమ్మేసి ఆ డబ్బుతో దాతల పేరున ధార్మిక కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిది.
దివాళా అంచున ఉన్న ఎస్ బ్యాంక్ లో డిపాజిట్లను సమయానికి వెనక్కు రప్పించి 1400 కోట్ల రూపాయలకు కాపలాకాసిన వ్యక్తి సుబ్బారెడ్డి. అలాంటి వ్యక్తి కేవలం కోటీ 53లక్షల రూపాయల ఆస్తుల అమ్మకంలో గోల్ మాల్ చేస్తారా, చేశారంటే బుద్దున్నోళ్లు ఎవరైనా నమ్ముతారా? ప్రజలు నమ్మలేదు కానీ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి.
టీడీపీ, బీజేపీ, జనసేన.. మూడూ కలసి హంగామా మొదలు పెట్టాయి. ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేశాయి. ముఖ్యంగా హిందువుల మనోభావాలతో ఆటలాడటం మొదలు పెట్టాయి. సరిగ్గా ఇక్కడే జగన్ సమయస్ఫూర్తితో అడుగు ముందుకేశారు. భక్తులు, మతపెద్దల అభిప్రాయాలు తీసుకున్నారు. ఆస్తుల అమ్మకంతో కలిగే లాభం కంటే.. అపనిందలతో జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకున్నారు. అందుకే టీటీడీ నిర్ణయాన్ని ప్రభుత్వం తరపున విరమించుకున్నారు. భక్తుల మనోభావాలను గౌరవించి కొత్త జీవో విడుదల చేశారు.
మిగతా విషయాల్లో మొండిగా ముందుకు పోయినా ప్రజలకు మేలు జరుగుతుంది, అందుకే కోర్టులకు సైతం ఎదురు నిలబడేందుకు వెనకాడలేదు జగన్. కానీ టీటీడీ ఆస్తుల వేలం విషయంలో మాత్రం ఆయన తన సహజసిద్ధమైన ధోరణిని పక్కనపెట్టి స్వామి భక్తుల మనోభావాలను గౌరవించారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే అసలైన నాయకుడు.