టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సీ ఓటర్-ఇండియా టుడే సర్వే వణికిస్తోంది. అందుకే ఆయన ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీదే అధికారమనే ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నారు. నారావారి మాటలకు అర్థాలే వేరులే అనే వ్యంగ్యోక్తి తెలుగు సమాజంలో బలంగా వినిపించే సంగతి తెలిసిందే.
అధికారమనే ఆశల పల్లకిలో చంద్రబాబు ఊరేగుతున్నారు. ఇప్పుడాయన్ను కలలే తప్ప వాస్తవాలు కాపాడలేవు. తాజాగా టీడీపీ సంస్థాగత అంశాలపై మండల, నియోజకవర్గ నేతలతో నిర్వహించిన వీడియో సమావేశంలో చంద్రబాబు ఎన్నికల్లో విజయంపై మాట్లాడ్డం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీకి దారుణ ఓటమి తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. ఈ విషయంలో ఆ పార్టీ వర్గాల్లోనే క్లారిటీ వచ్చిందని ఆయన అన్నారు. తమ కష్టాలు పోవాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఈ కామెంట్స్ వెనుక రాజకీయ పరిణామాలు, వివిధ సంస్థల సర్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సీ ఓటర్-ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషనల్ సర్వేలో …ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జాతీయస్థాయిలో మరోసారి బీజేపీ హవా చూపుతుందని తేలింది. తిరిగి మోడీ ప్రధాని అవుతారని సర్వే స్పష్టం చేసింది. ఇదే సందర్భంలో ఆంధ్రా విషయానికి వస్తే… వైసీపీ ఘన విజయం సాధిస్తుందని సర్వే తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదని వెల్లడైంది.
దేశంలో ప్రతిష్టాత్మక సర్వే నిపుణులు, జర్నలిస్టులు నిగ్గుతేల్చిన ఈ వివరాలతో చంద్రబాబు ఖంగుతిన్నారు. ఇప్పటికే జమిలి ఎన్నికలని, జగన్ జైలుకు వెళితే ప్రభుత్వం కుప్పకూలుతుందని, ఇలా ఏవేవో చెబుతూ పార్టీ నాయకులు, శ్రేణుల్ని కాపాడు కొస్తున్న చంద్రబాబుకు తాజా సర్వే ఫలితం పెద్ద షాక్. ఈ సర్వే ఫలితాల షాక్ నుంచి తాను బయటపడడంతో పాటు శ్రేణులకు భరోసా కల్పించేందుకు, చంద్రబాబు నోటి వెంట మళ్లీ మనదే అధికారమనే మాటలొస్తున్నాయనేది జగమెరిగిన సత్యం.
స్థానిక సంస్థలతో పాటు ఉప ఎన్నికల్లో కనీస స్థాయి పోటీ ఇవ్వని టీడీపీ… ఏ విధంగా పుంజుకుని తిరిగి అధికారంలోకి వస్తుందో చంద్రబాబే చెప్పాలి. ఇదంతా టీడీపీ శ్రేణుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నమే. బాబులో భయం అనే మూడ్‌ని ఆయన తాజా ప్రకటన ప్రతిబింబిస్తోంది.