ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఉద్యోగ సంఘాలు షాక్ ఇచ్చాయి. సమస్యల పరిష్కారంలో ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగులకు ఒక రకమైన ఘర్షణ వాతావరణం నెలకుంది. నూతన పీఆర్సీ, హెచ్ఆర్ఏ తదితరాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అంగీకరించే ప్రశ్నే లేదంటూ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. అంతేకాదు, తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమ బాట పడతామని హెచ్చరించడంతో పాటు ఏకంగా కార్యాచరణ కూడా ప్రకటించాయి.
నాలుగు ఉద్యోగ సంఘాల నాయకులు భేటీ అయిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక విషయం చెప్పారు. తమ ఉద్యమంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ పార్టీలను అనుమతించ కూడదని నిర్ణయించామన్నారు. ఈ నిర్ణయం టీడీపీకి షాక్ లాంటిదే. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైంది. అధికారంలోకి రావడానికి ఉద్యోగులను పావుగా వాడుకోవాలని వ్యూహం పన్నిన సమయంలోనే ఉద్యోగ సంఘాల నుంచి జీర్ణించుకోలేని ప్రకటన రావడం గమనార్హం.
తమ ఉద్యమంలోకి కేవలం పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, కార్మిక సంఘం నాయకులనే అనుమతిస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో తమ పార్టీ నాయకులతో నిర్వహించిన వీడియో సమావేశంలో చంద్రబాబు కీలక ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం చేతిలో మోసపోయి పోరాటాలు చేస్తున్న ఉద్యోగులకు మద్దతు ఇవ్వాలని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మనకు ఓటు వేశారా లేదా అనేది చర్చ కాదని, బాధిత వర్గం ఎక్కడున్నా టీడీపీ వారికి అండగా ఉంటుందన్నారు.
తమ ఉద్యమంలోకి రాజకీయ పార్టీలను అనుమతిస్తే చంద్రబాబు చివరికి ఏ విధంగా చేస్తారో ఉద్యోగ సంఘాల నాయకులు ముందే పసిగట్టి అప్రమత్తం అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల ఉద్యమంలోకి చొరబడేందుకు సిద్ధమవుతున్న టీడీపీకి బొప్పరాజు ప్రకటన అడ్డుకట్ట వేసినట్టైంది. ఈ నిర్ణయం ఉద్యోగ సంఘాలన్నీ కలిసి తీసుకున్నదే. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకూడదనే టీడీపీ కోరుకుంటోంది. మరి టీడీపీ ఆశల్ని అధికార పార్టీ ఏం చేస్తుందనేది కాలమే జవాబు చెప్పాల్సి వుంది.