మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి రైతులకు అన్యాయం జరిగిందనేది చంద్రబాబు ప్రధాన ఆరోపణ. అదే నిజమైతే ఆ అన్యాయానికి కారణం ఎవరు? రైతులను మోసం చేసింది చంద్రబాబు కాదా? అసత్యాలు చెప్పి రైతుల వద్ద అవసరానికి మించి భూములు సేకరించి, వాటిని రియల్టర్ల చేతిలో పెట్టి వంచన చేసింది బాబు కాదా. అమరావతి ఆందోళన మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు పెయిడ్ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్నది చంద్రబాబు అండ్ ఆయన సీక్రెట్ పెట్టుబడిదారులు కాదా? కనీసం ఇప్పటికైనా బాబు రైతులకు నిజం చెప్పగలరా?
అమరావతి అనేది ముగిసిన అధ్యాయం. మూడు రాజధానులకు గవర్నర్ ఆమోద ముద్ర పడిన తర్వాతైనా ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే చంద్రబాబు ఇంకా డ్రామాలాడ్డం ఆపలేదు. కోర్టుకెళ్తాం, మూడు రాజధానుల్ని అడ్డుకుంటామనే కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. వాస్తవానికి అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన తర్వాత అమరావతిలో పెద్ద వ్యతిరేకత రాలేదు. కనీసం అసెంబ్లీ అయినా ఉంటుంది కదా అని అనుకున్నారు సామాన్యులు. కానీ టీడీపీ పెయిడ్ ఉద్యమానికి తెరతీసింది. అనుకూల మీడియాతో ఆ వార్తల్ని హైలెట్ చేస్తూ ఏదో జరిగిపోతోంది, అమరావతి రగిలిపోతోంది అంటూ కలరింగ్ ఇచ్చారు. నిరసన దీక్షల్లో ఉన్నవారిని రోజుకో నాయకుడు వెళ్లి పరామర్శించి వచ్చేవారు. సినిమా ఫంక్షన్లలాగా 50 రోజులు.. 100రోజులు, సిల్వర్ జూబ్లీ.. అంటూ రచ్చ చేశారు.
కరోనా టైమ్ లో కూడా పసిబిడ్డలకు పలకలు చేతపట్టించి జై అమరావతి అంటూ నినాదాలు చేయించిన దగుల్బాజీ రాజకీయం చంద్రబాబుది కాక ఇంకెవరిది. నిజంగా చంద్రబాబు అమరావతి అభివృద్ధి ప్రదాత అయితే ఐదేళ్లు ఆయనకి సరిపోలేదా. తాత్కాలిక నిర్మాణాలతో సరిపెట్టిన బాబు మరో దఫా అధికారంలోకి వచ్చి ఉంటే.. ఇంకో ఐదేళ్లు షో చేసేవారు. నిజంగా చంద్రబాబు హయాంలో అమరావతి రూపురేఖలు మారిపోయి ఉంటే, జగన్ కి రాజధాని మార్చే అవకాశమే ఉండేది కాదు కదా. అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు లాభం కలుగుతుందనే విషయం తెలిసినా, అమరావతిలో తన బిజినెస్ దెబ్బ తింటుందనే ఉద్యమాన్ని ప్రేరేపించారు బాబు. పవన్ కల్యాణ్ ని కూడా ఆ ఉద్యమానికి వాడుకున్నారు.
తాజాగా గవర్నర్ రాజముద్రతో మూడు రాజధానులు అధికారికమయ్యాయి. అయినా కూడా చంద్రబాబు రైతుల్ని వంచించడం మానలేదంటే ఏమనాలి. న్యాయ స్థానాల్లో పోరాడతాం, అమరావతికి పునర్వైభవం తెస్తామని చెప్పే మాటల్ని ఎలా విశ్వసించాలి. ఇప్పటికైనా చంద్రబాబు రైతులకు నిజం చెబితే మంచిది, ఇంకా వారి జీవితాలతో ఆడుకోవాలని, వారిని పావులుగా చేసుకుని తాను పైకెదగాలని చూస్తే.. భవిష్యత్ తరాలు కూడా బాబుని క్షమించవు.