దొంగలు పడ్డ ఆర్నెళ్లకు.. టీడీపీకి మూడొచ్చింది

భారత్ లో కరోనా కష్టాలు మొదలై ఆరు నెలలు దాటిపోయింది. లాక్ డౌన్ మొదలైన కాలంలో వలస కార్మికులు కష్టపడ్డారు, చిరు వ్యాపారులు నష్టపోయారు, వివిధ రకాల వృత్తి కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.…

భారత్ లో కరోనా కష్టాలు మొదలై ఆరు నెలలు దాటిపోయింది. లాక్ డౌన్ మొదలైన కాలంలో వలస కార్మికులు కష్టపడ్డారు, చిరు వ్యాపారులు నష్టపోయారు, వివిధ రకాల వృత్తి కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదంతా గతం.. కేంద్ర ప్రభుత్వం కేవలం ఉచిత రేషన్ సరుకులు ఇచ్చి ఊరుకుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం లేవని చేతులెత్తేశాయి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్ సర్కార్ అందర్నీ ఆదుకుంది.

రైతులు, చేనేత కార్మికులు, ఆటో కార్మికులు, డ్వాక్రా మహిళలు, చిరు వ్యాపారులు.. ఇలా ఏ ఒక్కరినీ నిరాశపరచకుండా అందరికీ ఏదో ఒక రూపంలో నగదు సాయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. చేనేత కార్మికులకైతే.. ఏడాదిలో రెండుసార్లు నేతన్న నేస్తం డబ్బులు అందాయి. ఇది వాస్తవం. 

అయితే టీడీపీ మాత్రం తీరా కరోనా కష్టాలు తీరాక ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోంది. ఏకంగా వెబ్ సైట్ స్టార్ట్ చేసి అందులో మీ కష్టాలు నమోదు చేయండని సలహా పారేశారు చంద్రబాబు. బాధ్యతాయుత రాజకీయ పార్టీగా రాష్ట్ర ప్రజల ఇబ్బందుల పరిష్కారానికి టీడీపీ ఒక ఓపెన్ ఫోరమ్ ఏర్పాటు చేసిందని, ఏ సమస్యలున్నా మా వెబ్ సైట్ దృష్టికి తీసుకొస్తే మీ సమస్య పరిష్కారానికి మా పార్టీ ముందుండి పోరాడుతుందని చెప్పారు బాబు.

నిజంగా కరోనా సమస్యలున్నప్పుడు అసలు టీడీపీ నేతలు ఎక్కడికెళ్లిపోయారు. ఊరూవాడా వలస కూలీల కష్టాలు తెలుసుకుని ఆహారం పంపిణీ చేశారు వైసీపీ నేతలు. కూరగాయల ప్యాకెట్లు, నిత్యావసరాలు, మెడికల్ కిట్లు పేదలకు అందజేశారు. ప్రతి చోటా ఈ కార్యక్రమాలు చేపట్టింది కేవలం వైసీపీ నేతలు మాత్రమే. ఉన్నంతలో జనసైనికులు కూడా తమకు తోచిన విధంగా పేదల్ని ఆదుకున్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో  పూర్తిగా పక్కకు తప్పుకున్నది టీడీపీ నేతలు మాత్రమే. పార్టీ అధినేతలు చంద్రబాబు, లోకేష్.. ఇద్దరూ హైదరాబాద్ లో దాక్కుని, అద్దాల మేడ నుంచి తమాషా చూస్తుంటే.. స్థానిక నాయకులు ఎక్కడివాళ్లు అక్కడ సర్దుకున్నారు. ఒక్కరు కూడా గడప దాటి బయటకు రాలేదు. తీరా ఇప్పుడు కరోనా ప్రభావం క్రమక్రమంగా తగ్గుతున్న దశలో టీడీపీ వెబ్ సైట్  డ్రామా స్టార్ట్ చేసింది.

ఈ వెబ్ సైట్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. దొంగలు పడ్డ ఆర్నెళ్లకు.. టీడీపీకి మూడొచ్చిందని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. పేదలకు చేసిన ఆర్థిక సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తే.. దానిపై కూడా విమర్శలు  సంధిస్తూ నీఛ రాజకీయాలకు తెరతీసింది టీడీపీ. ఇప్పుడు తగుదునమ్మా అంటూ వెబ్ సైట్ పేరుతో కొత్త నాటకాలాడుతోంది. 

ఎలాగూ వెబ్ సైట్ తమదే కాబట్టి.. తప్పుడు రిపోర్ట్ లు నమోదు చేసి, రాష్ట్రంలో ఇన్ని సమస్యలున్నాయంటూ రేపోమాపో టీడీపీ నేతలు ఓ చిట్టా పట్టుకుని తెరపైకి వస్తారు. దీని కోసమే చంద్రబాబు వెబ్ సైట్ డ్రామాలు మొదలు పెట్టారనేది మాత్రం వాస్తవం. 

ఇదీ సబ్బం హరి చరిత్ర