ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల కూడా పూర్తికాకముందే.. చంద్రబాబు ఏడుపు మొదలు పెట్టారు. రాష్ట్రంలో విధ్వంసం జరిగిపోతోందంటూ రంకెలేస్తున్నారు.
తన హయాంలో అభివృద్ధి జరిగిందని, జగన్ దాన్ని కొనసాగించలేకపోతున్నారని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ తెగ బాధపడిపోతోంది. ఈ ఏడుపు మరో మూడున్నరేళ్లపాటు కొనసాగినా.. ఈలోగా ప్రజలకు ఆలోచించుకునే మంచి అవకాశాన్నిస్తున్నారు సీఎం జగన్.
చంద్రబాబు ఏంచేశారు?, జగన్ ఏం చేస్తున్నారు? ఈపాటికే పిక్చర్ క్లారిటీ వచ్చేసింది.
రాజధాని: బాబు Vs జగన్
అమరావతిలో కేవలం తాత్కాలిక నిర్మాణాలు కట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన బుద్ధుడి విగ్రహాన్ని చూపెడుతూ.. గ్రాఫిక్స్ మాయాజాలం చేస్తూ సొంత మీడియాతో సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు.
కేవలం విదేశీ యాత్రలు, రాజధాని డిజైన్లు, సినిమా దర్శకులతో చర్చలు.. ఇలా కేవలం మాటలతోనే సాగింది బాబు వ్యవహారం.
విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత జగన్ ఓ రేంజ్ లో స్పీడ్ పెంచారు. కోర్టు కేసులతో ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుపడుతున్నా కూడా ఆ స్పీడ్ ఆగలేదు.
మెట్రో రైలుకి డీపీఆర్ సిద్ధమవుతోంది, రేపోమాపో టెండర్లు పిలుస్తారు. ఇక తాజాగా భోగాపురం ఎయిర్ పోర్ట్ కూడా లైన్లోకి వచ్చేసింది. డిసెంబర్ లో శంకుస్థాపన, ఆ తర్వాత మూడేళ్లలో పనులు పూర్తి కావాలనేది జగన్ టార్గెట్.
అదే జరిగితే అనుకూల పరిస్థితుల్లో అమరావతికి బాబు చేసినదానికంటే.. ప్రతికూల పరిస్థితుల మధ్య విశాఖకు జగన్ చేసింది చాలా ఎక్కువ అవుతుంది. ఈమాత్రం పోలిక చాలదా జగన్ ని మరో పాతికేళ్లపాటు ఏలిక చేయడానికి.
పోలవరం: బాబు Vs జగన్
పోలవరం ప్రాజెక్ట్ ని చంద్రబాబు తన ఏటీఎంలాగా మార్చుకున్నారని స్వయానా దేశ ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఆ ప్రాజెక్ట్ వ్యవహారంలో టీడీపీ ఏం చేసిందనే విషయాన్ని చెప్పకనే చెప్పేశాయి.
కాఫర్ డ్యాం కట్టాం, కాంక్రీటు వేయడంలో రికార్డులు సృష్టించాం అని చెప్పుకోవాల్సిందే కానీ.. 70 శాతానికి సంబంధించి అయిన పనులు ఇవీ అని చెప్పుకునే ధైర్యం బాబుకి, ఆయన బ్యాచ్ కి లేదు.
కేంద్రం నిధులు ఇచ్చినా, ఇవ్వకపోయినా పోలవరం పూర్తి చేసి తీరుతామంటున్న జగన్.. ప్రాజెక్ట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఈపాటికే పలుమార్లు రుజువు చేశారు కూడా. నిధులపై కేంద్రంతో సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇక రాయలసీమ ఎత్తిపోతల ద్వారా సీమను సస్యశ్యామలం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలు అడ్డంకులు సృష్టిస్తున్నా.. ఈ ఐదేళ్ల పాలనలో సీమ ప్రాజెక్ట్ సాకారం చేసి తీరతానంటున్నారు. అదే జరిగితే బాబు సీమలో తల ఎత్తుకోలేరు.
ఇల్లు: బాబు Vs జగన్
7లక్షల ఇళ్లు కట్టాం, సున్నాలేశాం, గృహప్రవేశాలు కూడా చేశాం అని చెప్పుకోవడం మినహా.. ఒక్కరికి కూడా ఆ ఇంటిని అప్పగించలేదు చంద్రబాబు. అన్నీ అరకొర పనులే. బ్యాంకు రుణం లబ్ధిదారులపై నెట్టేసి చేతులు దులుపుకున్నారు. కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టి తన జేబు నింపుకున్నారు.
కానీ రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలందరికీ సొంత ఇంటి స్థలం ఇవ్వాలనేది జగన్ ఆలోచన. అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇళ్ల పట్టాల పంపిణీని పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. అమరావతిలో కూడా పేదలకు స్థలాలు కేటాయించారు.
బాబు బ్యాంకు అప్పుల్ని నెత్తిన వేస్తే.. వాటన్నిటినీ తాను మాఫీ చేస్తానంటున్నారు జగన్. ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయితే జగన్ కి ఇక తిరుగుండదనే దురుద్దేశంతోనే చంద్రబాబు కోర్టుల్లో కొర్రీలు వేసి, రాక్షసానందాన్ని పొందుతున్నారు.
ఇవి కొన్ని ప్రధానమైన పోలికలు మాత్రమే. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల నియామకంతో వేల ఉద్యోగాలు కల్పించారు సీఎం జగన్. ఊరూరా గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణంతో ప్రతి గ్రామానికి ప్రత్యేక ఆస్తుల్ని ఇచ్చారు. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు.
త్వరలో ప్రభుత్వ ఆస్పత్రులలో కూడా ఇదే విధానం అమలులోకి రాబోతోంది. ఆరోగ్యశ్రీ పరిధి పెంచారు. ఇక నగదు బదిలీ పేరుతో ప్రతి కుటుంబం అందుకుంటున్న ఆర్థిక సాయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇన్ని పోలికలు ఉన్నప్పుడు ప్రజలు ఎందుకు ఆలోచించకుండా ఉంటారు. చంద్రబాబు ఏం చేసినా, ఎన్ని చెప్పుకున్నా.. వీటినైతే జగన్ ఖాతాలో నుంచి తొలగించలేరు. కాబట్టి జగన్ సర్కార్ పై చంద్రబాబు ఎంత దుష్ప్రచారం చేసినా.. బాబు ఏం చేశారు.. జగన్ ఏం చేస్తున్నారనే ఆలోచన రాగానే.. చంద్రబాబుపై ప్రజల అభిప్రాయం మారిపోతుంది.