ఒక ఉప ఎన్నిక పోరు ఇంత ఉత్కంఠ రేకెత్తించడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి. సాధారణంగా ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ ఎక్కువగా వర్కవుట్ అవుతుంది. సిట్టింగ్ అభ్యర్థి మృతి లేదా అధికారంలో ఉన్న పార్టీ వేవ్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ దీనికి భిన్నంగా సాగుతోంది దుబ్బాక ఉప ఎన్నిక.
సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని విధంగా నువ్వా-నేనా అన్నట్టు సాగింది ఇక్కడ ఎన్నికల సమరం. అందుకే ఈ చిన్న నియోజకవర్గం రెండు తెలుగు రాష్ట్రాల్ని ఆకర్షించింది.
ఓవైపు బిహార్ లో రెండో దశ పోలింగ్ జరుగుతున్నప్పటికీ, మరోవైపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటికీ.. తెలుగు ప్రజల దృష్టి మాత్రం సింగిల్ సెగ్మెంట్ దుబ్బాకపైనే ఉంది. అధికార టీఆర్ఎస్ కు ఇది “ఎదురుదెబ్బ” అని కొందరు అంచనా వేస్తుంటే.. భారతీయ జనతాపార్టీది వాపా-బలుపా అనే విషయం తేలిపోతుందని మరికొందరు ఎదురు చూస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులా చుట్టేసే పరిస్థితులు కూడా ఉన్నాయని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. ఇలా పొంతనలేని విశ్లేషణలు, ఎటూ తేల్చని సర్వేలతో “దుబ్బాక ఫలితం” సంక్లిష్టంగా మారింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఈరోజు ఉపఎన్నిక పోలింగ్ మొదలైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టారు. సాయంత్రం 6 వరకు పోలింగ్ కు అనుమతిచ్చారు. ఓటరు ఎటువైపు మొగ్గాడు, ఏ పార్టీకి పట్టం కట్టాడో తేలాలంటే ఈనెల 10 వరకు ఆగాల్సిందే.
పార్టీల పరంగా చూసుకుంటే.. టీఆర్ఎస్ నుంచి సుజాత రామలింగారెడ్డి బరిలో ఉన్నారు. ఈమెను గెలిపించుకోవడం కోసం టీఆర్ఎస్ తన సర్వశక్తులు ఒడ్డింది. మరీ ముఖ్యంగా మంత్రి హరీష్ రావు, అన్ని పనులు పక్కనపెట్టి, కొన్ని రోజులుగా పూర్తిగా దుబ్బాకపైనే దృష్టిపెట్టారు.
ప్రారంభంలో ఆయన ఈ ఎన్నికల్ని లైట్ తీసుకున్నప్పటికీ.. రోజులు గడిచేకొద్దీ అతడికి ఇది “ఇజ్జత్ కా సవాల్” అన్నట్టు మారిపోయింది. ఖర్మ కాలి ఈ స్థానాన్ని టీఆర్ఎస్ కోల్పోతే.. పార్టీకి, కేసీఆర్ కు ఎంత నష్టం వాటిల్లుతుందో చెప్పలేం కానీ.. రాజకీయంగా హరీశ్ రావు మాత్రం ఇతర పార్టీలకు బాగా టార్గెట్ అవుతారనడంలో సందేహం లేదు. భవిష్యత్తులో హరీష్ ను విమర్శించడానికి ప్రతిపక్షాలకు దుబ్బాక ప్రధానాస్త్రంగా మారుతుంది.
ఇక బీజేపీ నుంచి రఘునందనరావు బరిలో నిలిచారు. క్షేత్రస్థాయిలో గమనిస్తే.. అధికార టీఆర్ఎస్ కంటే.. బీజేపీనే ఎక్కువగా ప్రచారం చేసింది. ప్రతి ఇంటిని కవర్ చేసిందనే చెప్పాలి. మరోవైపు కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారు. అయితే ప్రధానంగా పోటీ మాత్రం టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాత్రమే ఉండే అవకాశం ఉంది.
దుబ్బాకలో మొత్తంగా లక్షా 98వేల 756 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ల కోసం నియోజకవర్గంలో 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. 2వేల మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఈ ఉప ఎన్నికలో ఏకంగా 23 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అయితే అభ్యర్థులు ఎక్కువమంది ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ జరక్కపోవచ్చని భావిస్తున్నారు.