రాజధాని అమరావతికి టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి నుంచి చేసిన మోసం అంతాఇంతా కాదు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో రాజధాని తరలింపుపై విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలను పందెం కాసి… అనవసరంగా అమరావతి రైతులను బలి చేశారు.
మూడు రాజధానుల ఏర్పాటుకు అమరావతి రాజధాని పరిసర ప్రాంత ప్రజల ఆమోదం ఉన్నట్టు బాబు తన రెచ్చగొట్టే మాటలతో నిరూపించినట్టైంది. ఎందుకంటే గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైసీపీ విజయకేతనం ఎగుర వేసింది.
విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాన్ని ఓ పథకం ప్రకారం చంద్రబాబు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిట్టచివరిగా విజయవాడ, గుంటూరులో ఆయన నిర్వహించడం గమనార్హం. ఈ రెండు చోట్ల అమరావతి సెంటిమెంట్‌ను ప్రజల్లో రగిల్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. గత ఆదివారం విజయవాడలో చంద్ర బాబు ఏమన్నారో తెలుసుకుందాం.
‘అమరావతి కోసం నేను పోరాడుతుంటే సంఘీభావం తెలియజేసి … మీరు లక్షణంగా ఇంట్లో పడుకుంటే పనైపోతుందా? ఎందుకయ్యా… విజయవాడలో ఇంటికో మనిషి ఎందుకు బయటకు రారని అడుగుతున్నా. ఎక్కడుంది మీకు రోషం? ఎక్కడుంది పట్టుదల? ఈ ప్రాంత ప్రజలను గట్టిగా అడిగే సమయం వచ్చింది. అందుకే అడుగుతున్నా.. అమరావతి ఆంధ్రుల హక్కు అని నాకు బ్యానర్లు చూపిస్తున్నారు.
ఇంత వరకూ బాగానే ఉంది. బయటకు వచ్చి ఎక్కడ పోరాడుతున్నారు? రాజధానుల్లో అగ్ర రాజధానిగా అమరావతిని నిర్మించాలని ప్రణాళికలు తయారు చేస్తే … మీరు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి పాచి పనులు చేసుకోవడానికి వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నారు గానీ, అమరావతిని కాపాడుకోవడానికి సిద్ధంగా లేరు. అవునా…కాదా? కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోకపోతే రాజధాని అమరావతిని తరలించుకుపోవడానికి వైసీపీకి మద్దతిచ్చినట్టే అవుతుంది’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం గుంటూరు నగరంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడుతూ… ‘మీ జిల్లాకు ద్రోహం చేసిన వైసీపీని మునిసిపల్ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలి. అమరావతి వచ్చి ఉంటే గుంటూరు, విజయవాడ ఎంతగానో అభివృద్ధి చెందేవి. మాటల్లోనే మీకు రాజధాని కావాలి… చేతల్లో మాత్రం ఏమీ చేయరా? గుంటూరు వాసులకు స్వార్థం, పిరికితనం ఎక్కవ, రోషం లేదు.
ఒక ఉన్మాది చేతుల్లో అమరావతి బలైంది. గుంటూరు కార్పొరేషన్లో వైసీపీ గెలిస్తే అమరావతిని వారికి రాసిచ్చినట్టే. మీకు రోషం లేదా? రెండు వేలు ఎవరిస్తే వాళ్లకి ఓటేస్తారా? గుంటూరు మిర్చి రోషం, ఇక్కడి ఘాటుతనం 10న జరిగే ఎన్నికల్లో చూపించాలి’ అని కోరారు.
విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ల ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోకపోతే రాజధాని అమరావతిని తరలించుకుపోవడానికి వైసీపీకి మద్దతిచ్చినట్టే అని స్వయంగా చంద్రబాబే అన్న తర్వాత …ఇక ప్రత్యర్థులు ఊరుకుంటారా? ఇప్పుడు అదే మాట అధికార వైసీపీ నేతలు బలంగా చెబుతున్నారు. రాజధానిపై చంద్రబాబు రాజకీయ వ్యూహం బెడిసి కొట్టింది. కానీ చంద్రబాబు అత్యుత్సాహం, రాజకీయ స్వార్థంతో అమరావతి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది.
రాజధాని ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గెలుపొందడంతో జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజామోదం లభించినట్టైంది. ఇంత వరకూ రాజధాని తరలింపుపై ప్రజాగ్రహం ఉందన్న భయం … జగన్ ప్రభుత్వాన్ని వెంటాడేది. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఆ భయాన్ని కూడా పోగొట్టాయి.
రాజధాని అంశాన్ని కార్పొరేషన్ ఎన్నికల్లో రెఫరెండంగా చంద్రబాబు తీసుకు రావడం ద్వారా అమరావతి రైతులకు మరోసారి ఘోరమైన అన్యాయం చేసినట్టైంది. దీంతో బాబు వంచన తాజా ఎన్నికల తీర్పుతో సంపూర్ణమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.