అప్పలకొండ: జోగి! రాజకీయాల్లో “చిత్తశుద్ధి” అనే పదం ఎక్కువ వాడతారు కదా…దాని కరెష్టు మీనింగేంటి?
జోగినాథం: “చెత్తబుద్ధి” అంటే తెలుసా నీకు?
అప్పలకొండ: తెలుసు.
జోగినాథం: దానికి వ్యతిరేక పదమే “చిత్తశుద్ధి”…ఆపోజిట్ వర్డ్ అన్నమాట.
అప్పలకొండ: అలాగా!! అయితే జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధి వల్ల వైసీపీ మునిసిపల్ ఎన్నికల్లో గెలిచిందంటున్నాడు అంబటి రాంబాబు గారు…అంటే ఓడిపోయినోళ్లది చెత్తబుధ్ధి అంటావా?
జోగినాథం: ఓరి అప్పలకొండ! ఇలా పెట్టావా మెలిక!?
అప్పలకొండ: రూలింగోళ్లది చిత్తశుద్ధి అయినప్పుడు అపోజిషనోళ్లది చెత్తబుద్ధే కదా…నువ్వే చెప్పావు కదా ఆపోజిట్ వర్డ్ అని.
జోగినాథం: అలా అనడం తప్పురా…గెలుపు కోసం రకరకాల ఎత్తులేస్తారు..గెలవడం, ఓడిపోవడం వేరే విషయం…ఏమాటకామాట చెప్పుకోవాలి గానీ టీడీపీవోళ్లు పాపం ఒళ్లు దాచుకోకుండా కష్టపడ్డార్రా..
అప్పలకొండ: ఎలా?
జోగినాథం: ప్రచారం చేసారు కదా…గుళ్లు గోపురాలు బద్దలగొట్టేస్తన్నారు వైసీపీవోళ్లు అని.
అప్పలకొండ: ఆళ్లే అని తేలిందా?
జోగినాథం: కాదని తేలింది రా..మన రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి పూజారిగారే ఒప్పేసుకున్నాడు టీడీపీ వోళ్లే బలవంతపెట్టి తనచేత విగ్రహం విరక్కొట్టించే పని చేయించారని…
అప్పలకొండ: మరది చెత్తబుద్ధే కదా…
జోగినాథం: అలా అనేస్తే ఎలా? రాజకీయం అనుకోవచ్చుకదా!!
అప్పలకొండ: ఛ..సర్లే…ఇంకా ఎలా కష్టపడ్డారు? జనల్లోకెళ్లారా?
జోగినాథం: ఎళ్లారు కదరా…గుంటూరు, విజయవాడ వెళ్లి చంద్రబాబు గారు జనాన్ని తెగ తిట్టేసాడు…తనకి పదవక్కర్లేదని కేవలం ప్రజల భవిష్యత్తు కోసమే ఎండలో నిలబడి ప్రచారం చేస్తన్నానని చెప్పాడు.
అప్పలకొండ: (పకపకా నవుతూ) అయ్యబాబోయ్..బాబుగారికి పదవొద్దా?
జోగినాథం: వద్దా అంటే…కావాలి..ప్రచారం టైములో వద్దు…అంతే..
అప్పలకొండ: ఇది కూడా చెత్…
జోగినాథం: ఆగక్కడ…ఇది కూడా రాజకీయమే
అప్పలకొండ: ఏటిది? మామగార్ని వెన్నుపోటు రాజకీయం చేసేసినట్టు జనాన్ని కూడా వెన్నుపోటు పొడిసేద్దాం అనుకుంటన్నాడేంటి? అదంత వీజీ కాదు…
జోగినాథం: ఎహె…వెన్నుపోటు లేదు..పన్నుపోటు లేదు…రాజకీయం రా…
అప్పలకొండ: లేదన్నయ్యా…ఇప్పుడు సిలబస్ మారింది..
జోగినాథం: ఏంటది?
అప్పలకొండ: ఇలాంటి రాజకీయాలవల్ల పని జరగదు…జనం ముదిరిపోయారు…చిత్తశుద్ధికి చెత్తబుద్ధికి తేడా చాలా వీజీగా కనిపెట్టేస్తన్నారు.
జోగినాథం: మరేం చెయ్యాలంటావ్?
అప్పలకొండ: పాదయాత్ర చెయ్యాలి.. జనం దగ్గరకెళ్లాలి…ప్రేమగా ఓపిగ్గా ఆళ్ల కష్టాలు తెలుసుకోవాలి…అఫ్కోర్స్ దగ్గరకెళ్లి అడిగితే ఏదో ఒకటి చెప్తారు…వెంటనే మైకట్టుకుని ప్రభుత్వాన్ని తిట్టేయకుండా…ఆళ్ల మాటల్ని బట్టి జనం ఏం కోరుకుంటున్నారో ఒక అంచనా వేసుకోవాలి. దానికి తగ్గట్టు మ్యానిఫెష్టో విడుదల చెయ్యాలి…అప్పుడు ఎన్నికలకెళ్లాలి…గెలుపెందుకు రాదో చూడు..
జోగినాథం: ఏంట్రోయ్!! పెద్ద.. రాజకీయం కాచి వడబోసేసినట్టు చెప్పేత్తన్నావ్!
అప్పలకొండ: కాదన్నయ్య…జగన్ మోహన్ రెడ్డి చేసింది ఇదే కదా
జోగినాథం: అంటే ఏంటి…జగన్ ని బాబుగారు ఫాలో అవ్వాలంటావ్..
అప్పలకొండ: అంటాను..కానీ అది అయ్యే పని కాదు…
జోగినాథం: ఎందుకు?
అప్పలకొండ: జనం దగ్గరికెళ్లితే ఆయనకి ప్రేమ, ఓపిక చచ్చిపోతాయి..తిట్లొస్తాయి….పైగా ఇప్పుడీ వయసులో పాదయాత్ర అదీ అంటూ అంత లెగ్ వర్క్ కష్టం..
జోగినాథం: మరి ఎలారా?
అప్పలకొండ: ఆయన నాయకత్వం నుంచి తప్పుకోవాలి…
జోగినాథం: ఆయనెలా తప్పుకుంటాడు?
అప్పలకొండ: తప్పుకోకపోతే… వైసీపిని మర్చిపోయి కమ్యూనిస్ట్ పార్టీలతోటి, ఇండిపెండెంట్ల తోటీ పోటీ పడుతుండాలి అంతే..
జోగినాథం: అదేంట్రోయ్..మరీ అంతలా తీసిపారేత్తన్నావ్…? అది టీడీపీ రా…
అప్పలకొండ: అదంతా ఒకప్పుడు…మునిసిపల్ ఎన్నికల్లో 75 కి గాను ఒక్కటంటే ఒక్క సీటు గెలిచింది…కార్పరేషన్లలో 12 గానూ ఒక్కటి కూడా గెలవలేదు…అయిపోయిందన్నయ్య…ఇది పరమదారుణం…తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీదుంది.
జోగినాథన్: ఏంటి?? ఇంత ప్రచారం, ఇంత హడావిడి, స్టీల్ ప్లాంటు గొడవ, అమరావతి రైతుల ఉద్యమం, గుళ్లు గోపురాల రాజకీయం, కోర్టు కేసులు, దళితుల మీద ఎటాక్కుల వివాదాల తర్వాత కూడానా…!!?
అప్పలకొండ: అదే కదా నేను చెప్పేది…అవి చేసే కొద్దీ ఎనక్కే తప్ప అంగుళం కూడా ముందుకెళ్లదు బండి…ఇప్పుడు సిలబస్సు మారిపోయింది….జగన్ మోహన్ రెడ్డి మార్చేసాడు…బాబు గారు సిలబస్సులోలేని పాఠాలు ప్రిపేర్ అయ్యి ఎన్నికల పరీక్షలకెళ్తే ఇలా గుండు సున్నా మార్కులే మరి.
జోగినాథం: కొత్త సిలబస్సంటావ్, కొత్త నాయకుడు కావాలంటావ్…ఎవరున్నారు ఇప్పుడు…?
అప్పలకొండ: ఇంకెవరు..అందరూ చెప్పేది ఒకటే పేరు…
(ఇంతలో జోగినాథం మొబైల్లోంచి రింగ్ టోన్ వినిపిస్తుంది “నీ తాత టెంపర్, నీ అయ్య టెంపర్…”)
అప్పలకొండ: అదుగో…హహహ..నీ సెల్ ఫోనుకి కూడా తెలిసిపోయింది…నీకే ఇంకా వెలగలేదు .
జోగినాథం: (అప్పలకొండ వైపు చూస్తూ) ఎందుకెలగదురా! నేను చెప్పే లోపు నా ఫోన్ చెప్పిందంతే… పైనున్న ఆ తాత, ఆ అయ్య, ఈ ప్రకృతి అంతా అదే కోరుకుంటున్నట్టుంది…