‘వెన్నుపోటు’కే వెన్నుపోటు పొడిచిన వైనం

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి టీడీపీని తన హస్తగతం చేసుకున్న చంద్రబాబుకి, ఆ పార్టీ మినహా ఇప్పుడు నేతలు మిగిలేలాలేరు. ఒకరకంగా చెప్పాలంటే ఆ వెన్నుపోటు ఫలితాన్ని బాబు ఇన్నాళ్లకు అనుభవిస్తున్నారేమో అనుకోవాలి. గతంలో…

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి టీడీపీని తన హస్తగతం చేసుకున్న చంద్రబాబుకి, ఆ పార్టీ మినహా ఇప్పుడు నేతలు మిగిలేలాలేరు. ఒకరకంగా చెప్పాలంటే ఆ వెన్నుపోటు ఫలితాన్ని బాబు ఇన్నాళ్లకు అనుభవిస్తున్నారేమో అనుకోవాలి. గతంలో పార్టీ ఓటమిపాలైన సందర్భాల్లో కూడా సీనియర్లు తెలుగుదేశాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు మాత్రం బాబు అలా యూరప్ ట్రిప్ కి వెళ్లిన వెంటనే గంటల వ్యవథిలో రాజ్యసభ ఖాళీ అయింది.

ఏకంగా టీడీపీ పక్షాన్నే బీజేపీలో విలీనం చేసి చేతులు కడిగేసుకున్నారు టీడీపీ నేతలు. గోడదూకారు అనే మాటరాకుండా మూడింట రెండువంతుల మెజార్టీ చూసుకుని మరీ పార్టీని కమలంలో కలిపేశారు. కాషాయ కండువాలు కప్పేసుకున్నారు. ఎన్టీఆర్ ని చంద్రబాబు సీరియస్ గా వెన్నుపోటు పొడిస్తే.. బాబుని టీడీపీ నేతలు ఇలా సిల్లీగా పోటు పొడిచేసి వెళ్లిపోయారు. యూరప్ కి వెళ్లేటప్పుడు సెండాఫ్ ఇచ్చిన నేతలే.. ఆయన విమానం ఇలా ఎగరగానే, వీళ్లు ఇట్నుంచి ఇటు ఎగిరిపోయారు.

టీడీపీకి రాజ్యసభలో ఉన్న ఆరుగురు సభ్యుల్లో నలుగురు.. సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావు పార్టీ మారారు. ఇక మిగిలింది కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతారామలక్ష్మి. వీరిద్దరికీ మహూర్తం కుదరలేదంతే.. వెళ్లడం కాస్త లేటవ్వచ్చేమో కానీ, వెళ్లడం మాత్రం పక్కా. ఆ లాంఛనం కూడా పూర్తయితే రాజ్యసభలో టీడీపీ స్కోర్ జీరో. ఇక లోక్ సభలో ముక్కుతూ మూలుగుతూ మూడు సీట్లు టీడీపీకి దక్కాయి. ఈ ముగ్గురివీ మూడు లోకాలు.

ఇప్పటికే కేశినేని నాని బాబుపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు. ఆ వికెట్ ఎప్పుడు పడినా ఆశ్చర్యం లేదు. వ్యాపారాల కోసం గల్లా జయదేవ్ ఎప్పుడంటే అప్పుడు పార్టీ మారతారు. ఇక రామ్మోహన్ నాయుడు పరిస్థితి తెలిసే ఆయనకు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఆ పదవి తీసుకున్నాక పార్టీ మారి టీడీపీని మరింత భ్రష్టుపట్టించాలనే ఆలోచనలో యువ ఎంపీ ఉన్నట్టు తెలుస్తోంది.

ఎంపీలే కాదు, ఇటు ఎమ్మెల్యేల పరిస్థికి కూడా అలానే ఉంది. ఐదుగురు ఎమ్మెల్యేలతో ఓ వర్గాన్ని ఏర్పాటుచేసిన గంటా, సోమవారం నుంచి చర్చలు ప్రారంభించబోతున్నారట. అంటే వచ్చేవారం ఏ నిమిషానైనా వీళ్లంతా జంప్ అన్నమాట. మొత్తమ్మీద చంద్రబాబు యూరప్ ట్రిప్ కి వెళ్లొచ్చే సరికి రాష్ట్రంలో పార్టీ ఖాళీ అవడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

రామ్ గోపాల్ వర్మ మాటల్లో చెప్పాలంటే.. వెన్నుపోటుకే వెన్నుపోటు పొడిచిన అసలు సిసలు వెన్నుపోటు కథ ఇది.

టీడీపీ ఇంకా ఆ భ్రమల్లోనే ఉంది!