అమ్మఒడి అమ్మాయిలకు శాపమా..?

జగన్ నవరత్నాల హామీల్లో అత్యంత ఆసక్తిని కలిగించిన పథకం అమ్మఒడి. స్కూల్ కి వెళ్లే ప్రతి పిల్లవాడి పేరిట తల్లి ఖాతాలో 15వేల రూపాయలు జమచేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అంటే ఆర్థిక…

జగన్ నవరత్నాల హామీల్లో అత్యంత ఆసక్తిని కలిగించిన పథకం అమ్మఒడి. స్కూల్ కి వెళ్లే ప్రతి పిల్లవాడి పేరిట తల్లి ఖాతాలో 15వేల రూపాయలు జమచేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అంటే ఆర్థిక కారణాలతో ఏ పేద కుటుంబంలోనూ డ్రాప్-అవుట్స్ ఉండకూడదనేది సీఎం జగన్ ఆలోచన. దీనికి అనుగుణంగానే అమ్మఒడి పథకం అమలు చేస్తున్నామని ప్రకటించారు జగన్. అయితే విధి విధానాలపై ఇంకా స్పష్టత రాలేదు.

ఈ పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకే వర్తింపచేయాలని ఉపాధ్యాయ సంఘాలు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తింపచేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారే ఉండరని, అందరూ ప్రైవేట్ బడులకే వెళ్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ప్రస్తుతానికి ప్రభుత్వ బడులకే ఈ పథకం వర్తిస్తుందని కాస్త స్పష్టత ఇచ్చారు. ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తింపచేయాలా వద్దా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

అయితే గ్రామస్థాయిల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ పథకం అమ్మాయిలకు శాపంగా మారుతుందా అనే అనుమానం వస్తోంది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్న మధ్యతరగతి కుటుంబం కష్టమో నష్టమో ఇన్నాళ్లూ ఇద్దరినీ ప్రైవేట్ స్కూల్స్ కే పంపిస్తోంది. తాజాగా 15వేల రూపాయలు వస్తాయనే ఆశతో.. అమ్మాయిల్ని మాత్రం సర్కారు బడికి పంపడం మొదలు పెట్టారు చాలామంది తల్లిదండ్రులు. గ్రామాల్లో చాలావరకు ఇదే జరుగుతోంది.

ఈ విద్యా సంవత్సరం సడన్ గా ప్రభుత్వ స్కూళ్లలో అమ్మాయిల సంఖ్య ఎందుకు పెరిగిందా అని ఆరాతీస్తే అసలు కారణం ఇదీ అని తేలుతోంది. ప్రభుత్వ పాఠశాలలకే ఈ పథకం వర్తింపజేస్తే.. కచ్చితంగా అమ్మాయిలపై వివక్ష మొదలయ్యే అవకాశం ఉంది. అబ్బాయి కార్పొరేట్ స్కూల్ కి, అమ్మఒడి డబ్బుల కోసం అమ్మాయి సర్కార్ స్కూల్ కి.. ఇలా సంకుచితంగా ఆలోచించేవారు కూడా చాలామందే ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు అలా ఆలోచింపచేస్తున్నాయి.

ఇలాంటి పెడపోకడలను అరికట్టాలంటే ఈ పథకాన్ని ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తింపచేయాలనే డిమాండ్ మరోవైపు వినిపిస్తోంది. ఏదేమైనా ముఖ్యమంత్రి జగన్ తీసుకునే నిర్ణయంపైనే అమ్మఒడి విధి విధానాలు ఆధారపడి ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో కూడా వసతులు పెరిగి, బోధన మెరుగైతే.. అప్పుడు అబ్బాయిలు కూడా అనివార్యంగా సర్కారు బడుల వైపు అడుగులేస్తారు. అదే జరిగితే అమ్మఒడి పథకం రాష్ట్రంలో ఓ విద్యా విప్లవానికి నాంది పలకడం ఖాయం. 

టీడీపీ ఇంకా ఆ భ్రమల్లోనే ఉంది!