కరోనా సెకెండ్ వేవ్‌కు సంబంధించి తాజా గణాంకాలు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబులో ఆందోళన కలిగిస్తు న్నాయి.
గత రెండు మూడు నెలలుగా కరోనా సెకెండ్ వేవ్‌తో యావత్ దేశమంతా అల్లాడిపోతోంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ కూడా మినహాయింపేమి కాదు. కరోనా ఫస్ట్ వేవ్‌తో పోల్చితే సెకెండ్ వేవ్ తీవ్ర విధ్వంసానికి పాల్పడుతోంది. గత ఐదారు రోజులుగా తగ్గుముఖం పడుతున్నట్టు… రోజువారీ నిర్ధారణ లెక్కలు చెబుతున్నాయి.
మరీ ముఖ్యంగా సెకెండ్ వేవ్‌లో మహమ్మారి ఊపిరితిత్తుల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో కొందరు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి ఆక్సిజన్ అవసరమై, సమయానికి దొరక్క అన్యాయంగా ప్రాణాలు పోగొట్టు కోవాల్సి వచ్చింది. 93 శాతం కన్నా తక్కువ పల్స్ నమోదై ఆక్సిజన్ అవసరమైన వాళ్లు పది శాతం మందే. వాళ్లకు మాత్రమే అదనంగా ఆక్సిజన్ అవసరమైంది.
ఒక వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సగటున నిమిషానికి ఏడు నుంచి ఎనిమిది లీటర్ల గాలిని పీల్చి వదులుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన ఒక వ్యక్తికి రోజుకు సుమారు 11 వేల లీటర్ల గాలి అవసరమవుతుందని అంటున్నారు.
కరోనా సోకిన వాళ్లు ఆరు నిమిషాల నడక తర్వాత ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడితే వైద్యుల సలహా మేరకు మెడికల్ ఆక్సిజన్ తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా రోగికి సగటున నిమిషానికి ఒకటి నుంచి రెండు లీటర్ల మెడికల్ ఆక్సిజన్ అవసరమని వైద్యులు తెలిపారు. కానీ ఊపిరితిత్తుల పనితీరు లోపించడం వల్ల మెడికల్ ఆక్సిజన్ సమయంలో ఆక్సిజన్ వృథా అవుతుంది. దాని వల్ల పేషెంట్‌కు నిమిషానికి మూడు నుంచి నాలుగు లీటర్ల ఆక్సిజన్ వినియోగమవుతుందని అంచనా.
ఈ లెక్కన కరోనా రోగులందరికీ ఆక్సిజన్ అందించడం ప్రభుత్వాలకు భారమైంది. డబ్బు లేని వాళ్లే కాదు, డబ్బున్నా, సమయా నికి ఆక్సిజన్ బెడ్ దొరక్క ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ల గురించి మనం కథలుకథలుగా విన్నాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు ముందుకొచ్చి ఆక్సిజన్ సరఫరాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇలాంటి వారిలో ప్రముఖంగా సోనూసూద్, మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పుకోవచ్చు.
చిరంజీవి రూ.33 కోట్లు సొంత నిధులను ఖర్చు చేస్తుండటం నిజంగా అభినందనీయమే. ఇప్పుడిప్పుడే కరోనా రోగులు తగ్గుముఖం పట్టడం, ఆక్సిజన్ అవసరం కూడా అంతగా లేకపోవడంతో దేశం ఊపిరి పీల్చుకుంటోంది.
కేసులు తగ్గుతున్నందున రోజువారీ ఆక్సిజన్ అవసరాలు తగ్గుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కు మార్ సింఘాల్ తెలిపారు. అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున నాలుగు నియోజకవర్గాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసే పనిలో టీడీపీ ఉండగానే, ఆ అవసరం లేకపోవడం గమనార్హం.
తానెంతో గొప్ప హృదయంతో నాలుగు నియోజకవర్గాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఇంకా ఏర్పాటు చేస్తూ….వుండగా, అవసరం తీరిపోవడం చంద్రబాబు మనసుకు కష్టం కలిగిస్తోంది. తన సేవలను అందుకోవాలని కరోనా రోగుల నుదుట రాసినట్టు లేదు. ఇలాగైతే బాబుకు బాధగా ఉండదాండి…మీరే చెప్పండి!