సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన రాధే సినిమా ఒకేసారి ఇటు ఓటీటీలో, అటు అందుబాటులో ఉన్న థియేటర్లలో రిలీజైన సంగతి తెలసిందే. ఇప్పుడిదే పద్ధతిని రాధేశ్యామ్ కూడా ఫాలో అయ్యేలా ఉన్నాడు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాను కుదిరితే ఒకేసారి ఇటు ఓటీటీ, అటు థియేటర్లలో రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారు మేకర్స్.
ప్రస్తుతం రాధేశ్యామ్ నిర్మాతలతో జీ గ్రూప్ సంస్థ చర్చలు మొదలుపెట్టింది. ఇదే సంస్థ రాధే సినిమాను రిలీజ్ చేసింది. ఇప్పుడు అదే పద్ధతిలో రాధేశ్యామ్ ను కూడా రిలీజ్ చేసేందుకు సంప్రదింపులు షురూ చేసింది.
రాధే రిలీజ్ టైమ్ కు దేశంలో పరిస్థితులు బాగాలేవు. చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ నడిచింది. కాబట్టి వాళ్లు డైరక్ట్ ఓటీటీ రిలీజ్ తో పాటు, అందుబాటులో ఉన్న థియేటర్లలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులు కుదుటపడుతున్నప్పటికీ.. రాధేశ్యామ్ కు కూడా థియేటర్ల సమస్య ఎదురుకావొచ్చని భావిస్తున్నారు.
జులై 30న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఆ టైమ్ కు కరోనా తగ్గినా, థియేటర్లు తెరుచుకుంటాయనే గ్యారెంటీ లేదు. అందుకే మధ్యేమార్గంగా ''రాధే మోడల్''ను ఫాలో అవ్వాలని యూవీ క్రియేషన్స్ నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మరో 2 రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత రానుంది. ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమాను రాధాకృష్ణ కుమార్ డైరక్ట్ చేశాడు.