ద్రోణంరాజు అనే పేరు ఉత్తరాంధ్ర రాజకీయ చరిత్రలో మరిచిపోలేనిది. జుత్తాడ కరణంగా ప్రారంభించి ద్రోణంరాజు సత్యనారాయణ, ఉత్తరాంధ్రకే కీలక కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగారు.
కాంగ్రెస్ ఉజ్వలంగా వున్నరోజుల్లో ఉత్తరాంధ్రలో అభ్యర్థులను ఎంపిక చేయడంలో, ప్రచారంలో, అన్ని విషయాల్లో ద్రోణంరాజు సత్యనారాయణదే కీలక పాత్ర.
అలాంటి నాయకుడి కొడుకుగా ద్రోణంరాజు శ్రీనివాస్ మాత్రం మంచివాడు, సౌమ్యుడు, అందరితో కలివిడిగా వుండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు కానీ, రాజకీయాల్లో మరీ ఎదగలేకపోయారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ అంతకు మించి కాలేకపోయారు. వైకాపా జోరులో ఆయన ఓఢిపోయారు. గెలిచి వుంటే మంత్రి అయ్యే అవకాశం వుండదేమో?
కానీ సిఎమ్ జగన్ అలా అని వదిలేయలేదు. వుడా చైర్మన్ ను చేసారు. పోనీ అలా అని ఆ పదవిలో కొన్నాళ్లు వుంటే, వచ్చే ఎన్నికల నాటికి మంచి పొజిషన్ కు చేరుుకనేవారేమో? కానీ అంతలోనే కరోనా కాటేసింది. అలా అని ద్రోణంరాజు శ్రీనివాస్ వయసు కూడా ఏమంత ఎక్కువ కాదు.
విశాఖ క్యాపిటల్ అవుతున్న టైమ్ లో రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే తరుణంలో, కొడుకును రాజకీయాల్లో కాలూనుకునేలా చేయాల్సిన పని అలా వుండగానే, కుటుంబానికి చాలా మంది రాజకీయ నాయకుల్లా భయంకరంగా సంపాదించి పెట్టకుండానే, ద్రోణంరాజు శ్రీను (సన్నిహితులు ఇలాగే పిలుస్తారు) కన్నుమూయడం నిజంగా బ్యాడ్ లక్.
అన్నట్లు ద్రోణంరాజు శ్రీను సినిమా ప్రముఖుడు కోన వెంకట్ కు స్వయానా బావ. కోన సిస్టర్ నే ద్రోణంరాజు శ్రీను చేసుకున్నారు.