అక్టోబర్ 15 నుంచి థియేటర్లు, మల్టీ ఫ్లెక్స్ లు తెరుచుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే ఇది రాష్ట్రాల పరిస్థితులు, ఆదేశాల మేరకు లోబడి వుంటుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీనికి సై అన్నాయి. కొన్ని ఏ విషయమూ చెప్పలేదు.
ఇలా చెప్పని రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ కూడా వుంది. ఆంధ్రలో అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకునే అవకాశం చాలా తక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే కరోనా ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. దాదాపు పరిక్షల్లో ఎనిమిది నుంచి తొమ్మిది శాతం పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. స్కూళ్లకు అక్టోబర్ అంతా ఇంకా సెలవులే ప్రకటించారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించి, థియేటర్లకు తలుపులు తీయడం అన్నది ఎంతవరకు సబబు అనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రస్తుతానికి చూస్తుంటే సిఎమ్ జగన్ ఈ విషయం ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు.
అలాగే థియేటర్ల కరెంట్ బిల్లులు రద్దు చేయాలనే విన్నపం అలాగే వుంది. దాని మీద ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. పేదలు, మధ్య తరగతి జనాలు కరోనా టైమ్ లో నానా బాధలు పడి కరెంట్ బిల్లులు కట్టారు. ఇన్నాళ్లూ లక్షలు, కోట్లు ఆర్జించిన థియేటర్ యజమానులు కరోనా టైమ్ లో బిల్లులు రద్దు చేయమని అడగడం ఎంత వరకు సబబు అనే విమర్శలు కూడా వున్నాయి. దీని మీద కూడా జగన్ పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారా? అన్నది ఇంకా అనుమానమే.
ఇలాంటి నేపథ్యంలో అక్టోబర్ నెలలో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు ఎంత వరకు వుంటాయో చూడాలి. నైజాంలో తెరుచుకుని, ఆంధ్రలో తెరవకుంటే కొత్త సినిమాల విడుదలలు వుండవు.. కనీసం అక్టోబర్ 20 నుంచి థియేటర్లకు అనుమతి ఇస్తే కనుక దసరాకు కొత్త సినిమాలు వుండొచ్చు. లేదూ అంటే ఇక మిగిలింది దీపావళి విడుదలే. దానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.