తెలుగుదేశం పార్టీలో మరోసారి నాయకత్వ సంక్షోభం ఎదురయ్యే దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకవైపు. తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు అనే ట్యాగ్ తో పార్టీని నియంత్రిస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
ఆయన జూమ్ కు మాత్రమే పరిమితం అయిపోయారు. జూమ్ తో రాజకీయాలు చెల్లే అవకాశాలు కనిపించడమూ లేదు. ఇక చంద్రబాబుకు అంటే వయసు మీద పడింది ఇల్లు దాటే పరిస్థితి లేదు, మరి లోకేష్ కు ఏమైంది? అనే ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకూ లేదు.
ప్రజలు కరోనా కష్టాల మధ్యన కూడా బతుకుదెరువు కోసం రోడ్ల మీదకు వస్తున్నారు. కరోనాతో వారు సహవాసం చేస్తున్నారు. అయితే లోకేష్ లాంటి ప్రతిపక్ష నేత మాత్రం ఇంటికే పరిమితం అయ్యి, తన తీరేమిటో లోకానికి చాటుతూ ఉన్నాడు.
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే కదా… ప్రతిపక్షం ఉనికి చాటుకోవాల్సింది! ఇలాంటి అవకాశాన్ని టీడీపీ మిస్ అవుతోంది. దీనికి చంద్రబాబు, లోకేష్ లు బాధ్యత వహించాల్సి ఉంటుంది కూడా. చంద్రబాబుతో ఇక కాదు, లోకేష్ తో ఎప్పటికీ కాదు.. అనే స్పష్టత టీడీపీ శ్రేణులకు రానే వచ్చింది.
ఇలాంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు వస్తూ ఉంది. ఇటీవల కూడా కొందరు తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ ను పార్టీలో యాక్టివేట్ చేయాలంటూ చంద్రబాబు వద్ద ప్రస్తావించారట. అయితే తారక్ ను చంద్రబాబు ఎందుకు దూరం పెడుతున్నాడో ఎవరికీ తెలియనిది ఏమీ కాదు.
ఇప్పుడే లోకేష్ కు కమ్మ వారి మధ్యన కూడా కాస్త విలువ కనిపించడం లేదు, అలాంటిది జూ.ఎన్టీఆర్ రంగంలోకి దిగితే.. లోకేష్ తెరమరుగు కావడం రోజుల వ్యవధిలో జరగవచ్చు. అందుకే తారక్ ను చంద్రబాబు పక్కన పెడుతూ ఉన్నాడనేది, పార్టీలో తన స్థానం ఏమిటో స్పష్టత ఇవ్వనిది ఎన్టీఆర్ కూడా రాడనేది బహిరంగ సత్యమే.
ఇలాంటి నేపథ్యంలో పార్టీలో ఎన్టీఆర్ కు స్థానం గురించి నందమూరి బాలకృష్ణ స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్ ను పార్టీలో యాక్టివేట్ చేయడం ద్వారా ఆయన పార్టీకి ప్లస్ అవుతాడేమో.. అనే ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో బాలకృష్ణను అడగగా.. బాలకృష్ణ సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఎన్టీఆర్ పార్టీకి ప్లస్ అవుతాడనే అంశం గురించి ఆయన సానుకూలంగా కూడా స్పందించలేదు. ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదన్నట్టుగా బాలకృష్ణ స్పందించారు.
'ఎన్టీఆర్ ప్లస్ అవుతారు కదా.. 'అంటే, 'ప్లస్ అయ్యి, మైనస్ అయితే?' అంటూ డొంక తిరుగుడు సమాధానం ఇచ్చారు బాలకృష్ణ. ఆ పై ఏదో శ్లోకం చదివారు! ఆయన తీరుతో స్పష్టం అయ్యే విషయం ఏమిటంటే.. తారక్ ను పార్టీలోకి తీసుకునే ఉద్ధేశం చంద్రబాబుకే కాదు, బాలకృష్ణకు కూడా ఇష్టం లేని అంశమే!
జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మైనస్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఇలా అన్న కొడుకు గురించి తన అభిప్రాయాన్ని బాలకృష్ణ మీడియా ముఖంగానే క్లారిటీ ఇచ్చారు.