కొత్త రంగంలో, కొత్త పాత్రలో బాగా క్లిక్ అయ్యారు బాలయ్య. అదే ఆహాలో యాంకరింగ్. ఆయన చేసిన టాక్ షో యమా హిట్టయింది. ఓవైపు సినిమా షూటింగ్ కూడా లేకపోవడంతో పూర్తిగా ఆహాకే అంకితమయ్యారు బాలయ్య. ఈ క్రమంలో తను రాజకీయ నాయకుడ్ని అనే విషయాన్ని కూడా ఆయన మరిచిపోయినట్టున్నారు. అసెంబ్లీలో కంటే ఆహాలోనే బాగా రాణిస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు.
ఈ దశలో అటు సినిమాల్లో కూడా రెమ్యునరేషన్ భారీగా పెంచారనే టాక్ వినిపిస్తోంది. సినిమాల సంగతి పక్కనపెట్టినా.. ఆహాతో బాలయ్య మజాని ఆస్వాదిస్తున్నారు. ఇక రాజకీయాల విషయంలో కూడా ఆయన మరింత సైలెంట్ అయ్యే అవకాశముంది.
మామూలుగానే బాలకృష్ణ, ఎమ్మెల్యేగా తన సొంత నియోజకవర్గంలో పర్యటించడం చాలా అరుదు, తన చేయి దురద పెట్టినప్పుడు ఎవరినైనా కొట్టాలనుకున్నప్పుడే ఆయన హిందూపురంలో అడుగు పెడతారు. ఇప్పుడది కూడా పూర్తిగా కనుమరుగైంది. ఆహాలో అన్ స్టాపబుల్ షూటింగ్ ల వల్ల ఆయన ఎక్కడికీ రాలేకపోతున్నారట. కాన్సర్ ఆస్పత్రి పనుల్ని కూడా బాలయ్య తగ్గించుకున్నారంటే, పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆహా హ్యాంగోవర్ ఆయనకు బాగా పట్టేసింది.
బాలయ్య ఆహాకు ప్లస్ అయ్యారా, ఆహా వల్ల బాలయ్య క్రేజ్ పెరిగిందా అనేది చెప్పలేం కానీ.. మొత్తానికి బాలకృష్ణ ఈ ఓటీటీ ప్రోగ్రామ్ వల్ల మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ కి మరింత దూరమయ్యే అవకాశం ఉంది. దీనికితోడు ఆయన నటించిన సినిమా కూడా హిట్టవ్వడంతో బాలయ్య ఇప్పుడు పూర్తిగా వినోదానికే అంకితమయ్యారు. రాజకీయాలు పక్కనపెట్టారు.
మామూలుగా ఓ సినిమా హిట్టయితేనే వరుసపెట్టి సినిమాలు చేసే రకం బాలయ్య. అలాంటిది సినిమా సక్సెస్ తో పాటు ఓటీటీ సక్సెస్ కూడా ఒకేసారి అందుకున్న బాలకృష్ణను ఆపడం ఇక ఎవ్వరితరం కాదు. ప్రస్తుతం ఆయన మైండ్ లో రాజకీయాలకు లీస్ట్ ప్రయారిటీ.
చంద్రబాబు తాను సీఎం అయ్యేవరకు అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని శపథం చేస్తే.. బాలయ్య మాత్రం ఆహా షూటింగ్ అయ్యే వరకు అసెంబ్లీకి రాను అంటున్నారట. ఇప్పటికే హిందూపురానికి బాగా దూరమైన ఆయన, ఇప్పుడు రాజకీయాలకు మరింత దూరం అవుతున్నారు. తను ఎప్పుడు హిందూపూర్ లో అడుగుపెట్టినా జనం నీరాజనం పలుకుతారనే ధైర్యం బాలయ్యతో ఇదంతా చేయిస్తోంది.