కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. నందమూరి నట వారసుడు, ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ మాటలు కూడా ఇటు టీడీపీకి, అటు ఎల్లో మీడియాకు ఎంతో ముద్దొస్తున్నాయి. ఈ క్రమంలో అసలే అంతంత మాత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి జరుగు తున్న డ్యామేజీ గురించి వాళ్లు ఆలోచిస్తున్నట్టు లేదు. బాలకృష్ణ వ్యవహార తీరుతో మెగా అభిమానులతో పాటు కాపులు టీడీపీపై కారాలుమిరియాలు నూరుతున్నారు.
ఇటీవల తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో నిర్వహించిన సినీ పెద్దల సమావేశానికి, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీకి తనను ఎవరూ పిలవలేదంటూ బాలకృష్ణ మీడియా ముఖంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగి ఉంటే సమస్య లేకపోయేది. బాలకృష్ణ మరికాస్త దూకుడుగా భూములు పంచుకోడానికి సమావేశమయ్యారా అని సీరియస్ ఆరోపణలు చేశారు. బాలకృష్ణ కామెంట్స్‌పై మెగాబ్రదర్ నాగబాబు కూడా అంతే సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.
టాలీవుడ్‌లో బాలకృష్ణ పెద్ద తోపేం కాదని, ఆయన కేవలం ఒక హీరో మాత్రమే అని అన్నారు. భూములు పంచుకోడానికా అనే మాటలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని నాగబాబు డిమాండ్ చేశారు. ఈ పరంపరలోనే ఏపీ సీఎం జగన్‌ను చిరంజీవి నేతృత్వంలో చిత్ర పరిశ్రమ ప్రముఖులు కలుసుకున్నారు. అంతకు ముందు వివాదం నేపథ్యంలో సీఎం జగన్‌తో సమావేశానికి బాలకృష్ణను ఆహ్వానించారు. అయితే బర్త్‌డే పనుల్లో బిజీగా ఉన్నానని, రాలేనని చెప్పినట్టు నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు.
ఇదిలా ఉంటే బాలకృష్ణ తన పుట్టిన రోజు (జూన్ 10) సందర్భంగా పలు చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చిరంజీవిపై తన అక్కసును పరోక్షంగా వెళ్లగక్కడం చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు, చిరంజీవిని టార్గెట్ చేస్తూ బాలయ్య మాట్లాడ్డం మెగా అభిమానులు, జనసైనికులు, చిరు సామాజిక వర్గంలోని యువతకు కోపం తెప్పిస్తోంది.
“80స్ తారల రీ యూనియన్ ప్రతీ ఏడాది జరుగుతుంది. ఈసారి హైదరాబాద్‌లోనే పార్టీ జరిగింది. దానికి నన్ను పిలవలేదు. ఎందుకని నన్ను అవాయిడ్ చేసారు? అయినా ఐ డోంట్ కేర్. నాదంతా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ పాలసీ. చేస్తే పూర్తిగా అవాయిడ్ చేసేయండి. అప్పుడు నా దారిలో నేను వెళ్తా.. అంతే” అంటూ బాలయ్య కామెంట్స్ చేశారు.
ప్రతి సంవత్సరం 80స్ తారలందరూ రీయూనియన్ పార్టీ జరుపుకుంటారు. ఈసారి ఈ వేడుకలు హైదరాబాద్‌లో చిరంజీవి ఇంట్లో జరిగాయి. ఈ వేడుకలకు తనను పిలవలేదంటూ బాలయ్య తాజా మండిపాటుకు కారణం. “ ఐ డోంట్ కేర్. నాదంతా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ పాలసీ. చేస్తే పూర్తిగా అవాయిడ్ చేసేయండి. అప్పుడు నా దారిలో నేను వెళ్తా.. అంతే”…బాలకృష్ణ స్థాయికి తగ్గ మాటలేనా? ఎవరిని బెదిరించడానికి ఈ మాటలు? ఇలాంటి మాటలకు రెచ్చిపోయి మాట్లేడంత సంకుచిత మనస్తత్వం చిరంజీవికి లేదు. ఎందుకంటే చిత్రపరిశ్రమలో ఆయన ఎదుగుదల వడ్డించిన విస్తరేమీ కాదు. బాలకృష్ణ మాదిరిగా ఆయన వారసత్వంతో చిత్రపరిశ్రమలో అగ్రస్థానానికి రాలేదని విషయాన్ని గమనంలో పెట్టుకోవాలి.
చిరంజీవి మృధు స్వభావి, స్నేహశీలి అనే పేరు టాలీవుడ్‌లో ఉంది. ఎవరితోనూ శత్రుత్వాన్ని కోరుకునే వ్యక్తిత్వం కాదు ఆయనది. బహుశా బాలకృష్ణ దృష్టిలో చిరంజీవి అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే అయి ఉండొచ్చు. బాలకృష్ణ మాటలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రసారం చేస్తున్న ఎల్లో మీడియా ఆలోచన మరోలా ఉంది. జగన్, కేసీఆర్‌లతో చిరు సన్నిహితంగా మెలగడం ఎల్లో మీడియాకు ఏ మాత్రం నచ్చడం లేదు. అందువల్లే బాలకృష్ణను అడ్డుపెట్టుకుని చిరంజీవిపై ఎల్లో మీడియా గన్ పేలుస్తోంది. అందులో భాగంగానే ఏబీఎన్‌లో రాజధాని రైతుల మనోభావాలను చిరంజీవి బృందం దెబ్బ తీసిందంటూ ఏకంగా డిబేట్ పెట్టారు.
చిరంజీవిపై అవాకులు చెవాకులు పేలడం, ఆయన బృందంపై చానళ్లలో చర్చ పెట్టడం …ఇదేదో గొప్ప ఘన కార్యంగా బాలయ్య, ఎల్లో మీడియా భావిస్తుండొచ్చు. ఇదే క్రమంలో చిరంజీవి అభిమానుల్ని రెచ్చగొడుతూ…తమ గొయ్యి తాము తవ్వుకుం టున్నామనే విచక్షణ మరిచారు. చిరంజీవి లాంటి వివాద రహితుడిని టార్గెట్ చేయడం వల్ల మెగాస్టార్‌కు వచ్చే నష్టమేమీ ఉండదు. కానీ ఆయన్ను అభిమానించే వాళ్లలో శాశ్వతంగా వ్యతిరేక ముద్ర వేయించుకుంటామనే స్పృహ బాలయ్య, ఎల్లో మీడియాలో లోపించింది. అందుకే చిరంజీవిపై ఈ విపరీత పోకడలు.
బాలకృష్ణ కేవలం సినిమా హీరో మాత్రమే కాదు. ఆయన టీడీపీ శాసనసభ్యుడు కూడా. ఆ విషయాన్ని బాలయ్య మరిచినట్టున్నారు. బాలయ్య ప్రతి మాట రాజకీయంగా ప్రభావితం చేస్తుంది. మెగాస్టార్‌ను టార్గెట్ చేయడం వల్ల టీడీపీపై మరింత వ్యతిరేకత పెరగడం తథ్యం. తద్వారా వైసీపీకి లాభం కలిగించినట్టే.
బాలయ్య చేష్టలు, ఎల్లో మీడియా పైత్యం వల్ల అంతిమంగా వైసీపీకి మెగా అభిమానుల ఆదరణ లభిస్తుంది. ఒకవేళ వైసీపీకి కూడా దగ్గర కాలేదనుకున్నా…టీడీపీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వారు సానుకూలంగా వ్యవహరించరనేది సుస్పష్టం. పరోక్షంగా ఆ విధంగానైనా వైసీపీకి లాభమే. అందువల్ల బాలకృష్ణ తన మాటలతో వైసీపీ నెత్తిన పాలు పోస్తున్నారని చెప్పక తప్పదు.
-సొదుం