ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం…పరిచయం అక్కర్లేని పేరు. సంగీత ప్రపంచానికి ముద్దుబిడ్డ. తన మధుర కంఠంతో అనేక భాషల్లో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఘనత ఆయన సొంతం. గత నెలలో కరోనాబారిన పడిన ఆయన చెన్నైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై తాజాగా ఓ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది.
తాజాగా బాబుకు చేసిన వైద్య పరీక్షల్లో కరోనా నెగెటివ్ రావడం యావత్ సమాజానికి ఎంతో శుభవార్తగా చెప్పవచ్చు. తన తండ్రికి నెగెటివ్ వచ్చిన విషయాన్ని స్వయంగా ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎస్పీ చరణ్ ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన ఏం చెప్పారో తెలుసుకుందాం.
“నాన్న ఆరోగ్యం గురించి వారంతంలో అప్‌డేట్ ఇవ్వలేక పోయా. అందుకు క్షమించండి. ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంది. దాంతో వెంటిలేటర్ తొలగిస్తారని మేమూ భావించాం. అయితే, ఇంకా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉండడంతో వెంటిలేటర్ తీయలేదు. తాజాగా చేసిన పరీక్షల్లో నాన్నకు నెగటివ్ వచ్చింది” అని ఎంతో మంచి సమాచారాన్ని ఆయన అందించారు.
కొన్ని రోజుల క్రితం ఇలాగే ఎస్పీ బాలుకు వెంటిలేటర్ తొలగించారని, నెగెటివ్ వచ్చిందనే వార్తలు ఆయన కుమారుడి పేరుతో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే తన పేరుతో ఎవరో ఫేక్ సమాచారం ఇచ్చారని, తన తండ్రి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని అప్పట్లో ఆయన చెప్పుకొచ్చారు. కానీ నేడు బాలు ఆరోగ్యం గురించి చరణ్ అప్‌డేట్ ఇస్తూ…నెగెటివ్ వచ్చిందని చెప్పడం సంగీత ప్రియులు ఊపిరి పీల్చుకునేలా ఉంది. త్వరలో ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మన ముందుకు రావాలని ఆకాంక్షిద్దాం.