ఇటీవలే ఇండియాలో నిషేధించబడిన వివిధ మొబైల్, వెబ్ అప్లికేషన్లు తట్టాబుట్టా సర్దేస్తున్నాయి. ఇండియాలో అవి భారీ ఎత్తున వ్యాపారం చేసుకున్నాయి ఇన్నాళ్లూ. సరిహద్దుల్లో ఇండియా-చైనా మధ్యన ఉద్రిక్తతల నేపథ్యంలో వివిధ చైనీ యాప్స్ ను భారత ప్రభుత్వం నిషేధించడం తెలిసిన సంగతే. అయితే భారత ప్రభుత్వానికి ఆ యాప్స్ నిర్వాహకులు రకరకాల ప్రామిస్ లు చేశారు. తమ యాజమాన్యాలు చైనీవి అయితే అయి ఉండొచ్చు కానీ, వ్యాపారం వరకూ వచ్చే సరికి అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగానే పని చేయడం జరుగుతుందని అవి బహిరంగ ప్రకటనలు చేశాయి. భారత చట్టాలను అతిక్రమించే అవకాశమే లేదని వాటీ సీఈవోలు ప్రకటనలు చేశారు. ఈ విషయంలో కొన్ని కంపెనీలు చర్చలు కోరుకుంటున్నాయి.
దేశంలో భారీ మార్కెట్ ను కలిగి ఉన్న టిక్ టాక్ భారత ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు శతథా ప్రయత్నిస్తోంది. ఆఖరికి తమ హెడ్ క్వార్టర్స్ ను చైనా ఆవల నెలకొల్పనుందట. యూరప్ లోనో, సింగపూర్ లోనో ప్రధాన కార్యాలయాన్ని తెరిచి.. పని చేస్తామంటూ కూడా టిక్ టాక్ ప్రకటనలు చేస్తూ ఉంది. అయితే భారత ప్రభుత్వం మాత్రం చైనీ యాజమాన్యాల ఆధ్వర్యంలోని కంపెనీల పట్ల జాలి చూపే అవకాశాలు లేనట్టే.
ఈ క్రమంలో కొన్ని యాప్స్ వాళ్లు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఇండియా నుంచి తట్టాబుట్టా సర్దేస్తున్నాయని సమాచారం. ఆ జాబితాలో ముందు నిలుస్తోంది ఆలీబాబా కంపెనీ. ఆలీబాబా గ్రూప్ కు సంబంధించి ఇండియాలో పలు యాప్స్ నడుస్తున్నాయి. వాటిల్లో యూసీ బ్రౌజర్ ముఖ్యమైనది. అనేక చైనీ ఫోన్స్ లో యూసీ బ్రౌజర్ ఇన్ బిల్ట్ గా ఉంటుంది. ఆ బ్రౌజర్ సేవలకు అనుసంధానంగా వార్తలూ, వీడియోలు గట్రా ఇస్తోంది యూసీ. దీని కోసమని ఇండియాలో స్టాఫ్ ను నియమించుకోవడంతో పాటు, ఆఫీసులను కూడా పెట్టుకుంది. అయితే చాలా వరకూ ఔట్ సోర్సింగ్ ద్వారా, వేరే సంస్థల పే రోల్ లో నియామకాలు చేసింది ఆ సంస్థ.
ఇప్పుడు నిషేధిత యాప్స్ లో యూసీ కూడా ఉంది. ఇక భారత ప్రభుత్వాన్ని ప్రాధేయపడినా ప్రయోజనం లేదని గ్రహించి, ఇండోచైనా సంబంధాలు ముందు ముందు జటిలం కావడమే తప్ప సానుకూలంగా ఉండబోయే అవకాశాలు లేవని గ్రహించి.. ఆ సంస్థ ఇండియాలో తన యాక్టివిటీస్ ను ఆపేస్తోందట. ఇప్పటికే ఎంప్లాయిస్ కు సూఛాయ మెసేజ్ లు వచ్చాయని సమాచారం. నిషేధితం అయిన యాప్స్ లో బోలెడంత మంది ఉద్యోగులు పని చేస్తూ వచ్చారు. వారికి మాత్రం ఇది ఇబ్బందికరమైన పరిస్థితే.