కాదేదీ కవితకు అనర్హమని మహాకవి శ్రీశ్రీ అంటే…కాదేదీ దుష్ప్రచారానికి అనర్హమని ప్రతిపక్ష టీడీపీ చేసి చూపుతోంది. జగన్ సర్కార్‌ను భ్రష్టు పట్టించేందుకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఏదో ఒకటి సృష్టించడం, దానికి ఎల్లో మీడియా మరింత మసాలా జోడిస్తూ నిజమని నమ్మించే ప్రయత్నాలు నిత్యం కొనసాగుతున్నాయి.
ఈ పరంపరలో వారం రోజులుగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తున్నట్టు టీడీపీ, ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఒక వైపు ఉద్యోగ సంఘాల నాయకులు ఇది వాస్తవం కాదు అని నెత్తీనోరు కొట్టుకుని చెబుతున్నా కొందరు ఉద్యోగులు నమ్మలేని పరిస్థితి. మరీ ముఖ్యంగా 57 , ఆపైన వయస్పున్న ఉద్యోగుల్లో అభద్రతా భావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
తమ రిటైర్మెంట్ వయస్సును తగ్గించేందుకు ప్రభుత్వం లోలోన ఏదో చేస్తోందనే అనుమానం కలిగించడంలో ప్రతిపక్షం, దాని బాకా ఎల్లో మీడియా సక్సెస్ అయ్యాయనే చెప్పొచ్చు. నిజం ఇంటి గడప దాటే లోపు, అబద్ధం లోకమంతా చుట్టేస్తుందన్న చందంగా ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు తగ్గిస్తున్నారనే దుష్ప్రచారం ఏపీ ఉద్యోగుల్లో భయాందోళన కలిగిస్తోంది.
ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును తగ్గించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదని కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డితో పాటు ఇతర సంఘాల రాష్ట్ర నాయకులు పదేపదే పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా చెబుతూ అబద్ధ ప్రచారానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు.
అయినప్పటికీ కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం డీజీపీ, సీఐడీ అడిషనల్ డీజీలకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి వినతిపత్రాలు సమర్పించారు. ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేస్తున్న వారిని కటకటాల పాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.