ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై పలు ఆరోపణలతో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖపై ఢిల్లీ బార్ అసోసియేషన్ స్పందించిందట. అసలు వార్తను రాయని ఈనాడు వంటి వార్తా సంస్థలు ఈ ఖండన వార్తలకు మాత్రం చాలా ప్రాధాన్యతను ఇచ్చాయి.
జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన విషయాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాలు వార్తగా కూడా రాయలేదు. అనేక జాతీయ వార్తా సంస్థలు ఈ విషయాన్ని కవర్ చేయగా.. జాతి మీడియా మాత్రం ఈ వార్తలను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పకనే చెప్పాయి.
వార్తను వార్తగా కూడా ఇవ్వకుండా తమ బుద్ధిని దాచుకోకుండా చూపించాయి. అయితే జగన్ లేఖను ఖండించిన వారిని వార్తలను మాత్రం రాస్తున్నాయి! నిన్న హైదరాబాద్ లో ఒక లాయరెవరో ఖండించాడట, ఆ తర్వాత ఢిల్లీ బార్ అసోసియేషన్ ఖండించిందట! అసలు వార్తను ఇవ్వకుండా, ఖండన వార్తలు ఇవ్వడం ద్వారా తమ పాఠకులకు తెలుగుదేశం అనుకూల మీడియా ఏం సందేశం ఇవ్వాలని భావిస్తోందో మరి!
ఇక జగన్ వి నిరాధార ఆరోపణలు అని బార్ అసోసియేషన్ తేల్చిందట! ఇంతకీ బార్ అసోసియేషన్ అంటే అదేమైనా కోర్టా? ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు అది ఆధారమో, నిరాధారమో తేల్చాల్సింది న్యాయస్థానం కానీ, బార్ అసోసియేషన్ కాదు కదా? అనేది సామాన్యుడి సందేహం! బార్ అసోసియేషనే తీర్పులు ఇస్తూ పోతే.. కోర్టులెందుకు? లాయర్లు చాలు కదా!
నిరాధార ఆరోపణలు అంటూ వీళ్లు అంత తేలికగా ఎలా తేల్చేస్తున్నట్టు? అది తేల్చాల్సింది న్యాయస్థానం కదా! అని సామాన్యులు అనుకుంటున్నారు. ఈ విషయంపై సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే గంగూలీ లాంటి వాళ్లు స్పందిస్తూ.. విచారణ జరిగాలని, విచారణ జరిగితేనే మంచిదని అభిప్రాయపడ్డారు.
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తేమో విచారణ జరగాలంటే, విచారణే అవసరం లేకుండా.. అంతా నిరాధారం అంటూ డబ్బులు తీసుకుని వాదించే లాయర్లు తీర్పులు ఇస్తున్నారు! ఇదీ కథ!