బతుకమ్మ సాక్షిగా ‘బస్సు’ బతుకులు!

తెలంగాణలో అతి పెద్ద పండుగగా 'బతుకమ్మ పండుగ'ని కేసీఆర్‌ ప్రభుత్వం గడచిన ఐదేళ్ళుగా నిర్వహిస్తూ వస్తోంది. కానీ, ఈసారి బతుకమ్మ పండుగ, ఆర్టీసీ కార్మికుల బతుకుల్ని బజారుకీడ్చేసింది. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే దిశగా…

తెలంగాణలో అతి పెద్ద పండుగగా 'బతుకమ్మ పండుగ'ని కేసీఆర్‌ ప్రభుత్వం గడచిన ఐదేళ్ళుగా నిర్వహిస్తూ వస్తోంది. కానీ, ఈసారి బతుకమ్మ పండుగ, ఆర్టీసీ కార్మికుల బతుకుల్ని బజారుకీడ్చేసింది. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసేసింది. 'సగం ప్రైవేటు, సగం ఆర్టీసీ' అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన మొత్తం తెలంగాణ సమాజాన్నే షాక్‌కి గురిచేసింది.

ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం, సంస్థ బాగు కోసం ఆందోళనలు చేయడం కొత్తేమీకాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ జరిగాయి.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ కార్మికులకి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. దాంతో కార్మికులు, ఉద్యోగులుగా పరిగణింపబడ్తారక్కడ.

'మీ మిత్రుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ఆదుకున్నాడు.. మీరూ ఆర్టీసీని తెలంగాణలో ఆదుకోండి..' అంటూ తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేస్తేంటే, 'అన్యాయం.. అక్రమం..' అంటూ కార్మికుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటనతో, సుమారు 48 వేల మంది ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. కొత్తవారి రిక్రూట్‌మెంట్లు కూడా షురూ అవుతున్నాయట.

బతుకమ్మ సంబరాలు ఓ పక్క ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంటే… ఆర్టీసీలోని మహిళా కార్మికులు కంటతడి పెడుతూ బతుకమ్మ ఆడుతున్నారు.. ప్రభుత్వం తీరుకి నిరసనగా. అయినా, బంగారు తెలంగాణలో ఈ 'బతుకులు బుగ్గి' అయిపోవడం ఏంటి.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. పండగ వేళ ఈ ఆందోళనలు ఏంటి.? అని తొలుత చిరాకు పడ్డ ప్రయాణీకులు, ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో వ్యవహరిస్తున్న తీరుతో మనసు మార్చుకుంటున్నారు. ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు.

ప్రయాణీకుల సౌకర్యార్దం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, ఆ ప్రయాణీకులకు బస్సుల్లో టిక్కెట్లు ఇవ్వకుండా దండుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఏదిఏమైనా, తెలంగాణలో ఇదొక ఆశ్చర్యకరమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ముందు ఆర్టీసీ కొరివితో తెలంగాణ ప్రభుత్వం తలగోక్కుందనే చెప్పాలి.

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.. ఈ తరుణంలో కేసీఆర్‌ సర్కార్‌ మరింత మొండికేస్తే.. సరికొత్త రాజకీయ సమీకరణాలు తెలంగాణలో తప్పకపోవచ్చు.  

‘సైరా నరసింహారెడ్డి’ వాస్తవికత ఎంతంటే!