రాయలసీమ అంటే డెఫినేషన్లు మారిపోయే కాలం వచ్చింది. అయితే ఫ్యాక్షన్ కాకపోతే కరువు అన్నట్టుగా రాయలసీమ విషయంలో కొన్ని స్థిరమైన అభిప్రాయాలున్నాయి. ఫ్యాక్షన్ కు చరమగీతం పాడి చాలా కాలం అయ్యింది రాయలసీమ ప్రజానీకం. గత రెండు దశాబ్దాల్లో జరిగిన హత్యలు ఏవైనా ఉంటే.. అవి రాజకీయ ప్రతీకార హత్యలే. అలాంటి హత్యలకు రాయలసీమ అయినా, కోనసీమ అయినా ఒకటే. అలాంటి లెక్కలే తీస్తే.. కథ వేరేలా ఉంటుంది.
ఇక కరువు.. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న గత టర్మ్ ఐదేళ్లలో కూడా రాయలసీమను కరువు ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎంతలా అంటే.. కొన్ని ప్రాంతాల్లో.. నిలువునా ఎదిగిన మామిడి చెట్లు కూడా మాడిపోయాయి! నీటి వనరు లేక.. చీనీ చెట్లు, మామిడి చెట్లు నిలువునా ఎండాయి కొన్ని ప్రాంతాల్లో. ఒక వేరుశనగ పంట సంగతీ అంతే. కీలకమైన ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరుణుడు పూర్తిగా మొహం చాటేసేవాడు. దీంతో ఆ వర్షాధార పంట ఆకులు ఎండి, చెట్టు నేలకు మొహం వాలేసేది. అలాంటి పరిస్థితుల్లో రెయిన్ గన్నులు అంటూ చంద్రబాబు నాయుడు జనాలను వెక్కిరించే వారు.
అదేంటో కానీ.. చంద్రబాబు అలా అధికారం నుంచి దిగిపోగానే రాయలసీమ ప్రాంతంపై వరణుడు తన చల్లని చూపు చూస్తున్నాడు. గత ఏడాది జూన్ నుంచి మంచి వర్షాలు నమోదయ్యాయి. వేరుశనగ పంట దక్కింది. భూగర్భజలాలు పెరిగాయి. ఇక ఈ ఏడాది అయితే.. మే నుంచినే వరుణుడు దంచి కొట్టాడు.
కృష్ణా జలాలతో ఈ ఏడాది కూడా రాయలసీమకు గరిష్ట స్థాయి నీటి లభ్యత. మరోవైపు ఈడాఆడా తేడా లేకుండా నాలుగు జిల్లాల్లోనూ రికార్డు స్థాయి వర్షపాతాలు. ఎంతలా అంటే.. అనంతపురం, కడప ప్రాంతంలో ముప్పై యేళ్ల లో ఎన్నడూ చూడనంత వర్షాలు అని స్థానికులు చెబుతున్నారు. దశాబ్దాల కిందట ఎండిపోయిన పెన్నానది ఇప్పుడు పెన్నేటి పాట పాడుతూ ఉంది! కర్నూలు జిల్లాకు ఈ రెండు జిల్లాలకు మించిన స్థాయిలో వర్షపాతం! హంద్రీ నది సాగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు రాయలసీమే ఈ సారి నీరిచ్చింది! తుంగభద్ర, హంద్రీ నదుల ద్వారా భారీ స్థాయిలో నీరు శ్రీశైలం ప్రాజెక్టును చేరింది ఈ సంవత్సరం!
అనంతపురం జిల్లాలో వినిపిస్తున్న మాటేంటంటే.. మరో రెండేళ్లకు భూగర్భ జలాల లోటు ఉండదు అనేది! ఉమ్మడి ఏపీలోనే పెద్ద చెరువులు అయిన బుక్కపట్నం చెరువు, ధర్మవరం చెరువులు ఇప్పటికే మరువ పోయాయి! అటు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా నీటి లభ్యత ఈ సంవత్సరం భారీ స్థాయిలో ఉండబోతోంది! కడప జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు రికార్డు స్థాయి కెపాసిటీని చేరుకున్నాయి.
వరసగా రెండో ఏడాది ఒకసారికి మించిన జలకళ మరోసారి కనిపిస్తోంది. రాబోయే మరి కొన్నేళ్లు ఇదే స్థాయిలో నీటి లభ్యత నమోదైతే.. రాయలసీమ ఎత్తిపోతల పథకం వంటిది పూర్తయితే.. సీమలో కరువనే మాట కరువవ్వడం ఖాయం!
ఫొటో.. దీబాగుంట్ల(నంద్యాల)- సిరివెళ్ల మెట్ట(అళ్ళగడ్డ) మధ్యన. శ్రీశైలం రైట్ బ్యాక్ కెనాల్(ఎస్ఆర్బీసీ) ఆయకట్టు ప్రాంతంలో వరి పంటతో ఆవరించిన పచ్చదనం. అత్యంత రుచికరమైన బియ్యం కర్నూలు రైస్ కు పురిటిగడ్డ.