ఎవరో ఒకరు, ఎపుడో అపుడు, నడవరా ముందుగా..అన్నాడో సినీ కవి. పాలనలో తనదైన శైలి నిర్ణయాలతో అలాంటి సాహసాలనే స్ఫురింపచేస్తున్నారు సీఎం జగన్. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంపై ముఖ్యమంత్రి జగన్ గట్టిగానే ఉన్నారు. ప్రతిపక్షాల ఆందోళనలు, ఓ వర్గం మీడియా రాద్ధాంతాలు.. అన్నీ వింటున్నా చలించలేదు. కానీ ఉపాధ్యాయుల గోడు విని మాత్రం జగన్ కాస్త వెనక్కు తగ్గారు.
ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తూ తొలుత ఉత్తర్వులిచ్చింది ప్రభుత్వం. ఆ తర్వాత విడతల వారీగా 9,10 తరగతులను కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మార్చేస్తారు. అయితే దీనికి సంబంధించి మౌలిక వసతులు, మానవ వనరులు ప్రభుత్వ పాఠశాల్లో లేవనేది నగ్న సత్యం. అయినా సరే వాటిని సరిదిద్దుతామనే ధైర్యంతో జగన్ ఒక అడుగు ముందుకేశారు.
కానీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం తమ వల్ల కాదంటూ చేతులెత్తేశాయి. “ఒకేసారి అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అంటే మేం సిద్ధంగా లేము, విద్యాప్రమాణాలు పడిపోతే మాది బాధ్యత కాదు” అంటూ ఒకరకంగా బెదిరించాలని చూశాయి. ఇలాంటి బెదిరింపులకు జగన్ భయపడే రకం కాదు కానీ, విద్యార్థుల భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని జగన్ కాస్త వెనక్కు తగ్గారు. తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఉపాధ్యాయుల ఇగో హర్ట్ అయి, విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని జీవోలో మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు.
ఒకటినుంచి 6వ తరగతి వరకు మాత్రమే వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు మీడియం బదులు, ఇంగ్లిష్ మీడియంను ప్రవేశ పెడుతున్నట్టు తాజాగా ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాత ఏడాది నుంచి విడతల వారీగా 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతూ వెళ్తారు. ఒకరకంగా ఇంగ్లిష్ మీడియం వద్దు వద్దు అంటున్న వాళ్లు కూడా జగన్ నిర్ణయంతో సందిగ్ధంలో పడ్డారు. ఉన్న ఫళంగా మీడియం మార్చలేదు, హైస్కూల్ విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టట్లేదు, అటు ఉపాధ్యాయులకు కూడా పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి నేపథ్యంలో ఇంగ్లిష్ మీడియం విషయంలో రాద్ధాంతం చేయడం సరికాదని విపక్షాలకు కూడా అర్థమవుతోంది.
ఇక మిగిలింది ఓ వర్గం మీడియా. ఎంతసేపూ ముఖ్యమంత్రి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వార్తలు రాయడం అలవాటైన ఆ మీడియాను ఇప్పటికే ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రజాభిప్రాయాలను ప్రచురించడం మానేసి, సొంత అభిప్రాయాలనే వారిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకోలేం. సో.. సోకాల్డ్ మేథావుల నోళ్లన్నిటికీ ఇక తాళం పడ్డట్టే. ఈ విషయంలో జగన్ తగ్గినట్టు కాదు. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు జగన్.