జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతోంది. ఇప్పటికే ఎంతోమంది పదవులు దక్కించుకున్నారు. అధికారంలోకి వచ్చిందే తడవుగా నామినేషన్ పదవుల్ని భర్తీ చేశారు జగన్. తనను నమ్ముకున్న వాళ్లందరికీ పదవులు ఇచ్చారు. చివరికి లక్ష్మీపార్వతికి కూడా పదవి దక్కింది. అయితే ఈ మొత్తం ప్రహసనంలో అలీ ఇంకా రాజకీయ నిరుద్యోగి గానే ఉన్నారు.
జూనియర్ అయిన పృధ్వి లాంటి వాళ్లకు కూడా పదవులిచ్చిన జగన్, అలీ విషయంలో మాత్రం చూసీచూడనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థంకావడం లేదు. చివరికి అలీకి ఎంతో ఇష్టమైన ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా అతడి చేజారిపోయేలా కనిపిస్తోంది. ఈ పదవిని అలీకే ఇస్తారంటూ 2 రోజులుగా ప్రచారం సాగింది. ఇప్పుడు ఆ స్థానంలో విజయ్ చందర్ పేరు బలంగా వినిపిస్తోంది.
సో.. అలీకి ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా లేనట్టే. ఇంతకీ అలీ విషయంలో జగన్ ఏం ఆలోచిస్తున్నారు. అతడికి పదవి ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. అయితే ఎవరూ ఊహించని పదవిని తనకు జగన్ ఇస్తారనే ఆశ మాత్రం అలీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఎన్నికలకు ముందు కోరుకున్న స్థానం, కోరుకున్న పదవి అంటూ కండిషన్లు పెట్టిన ఈ సీనియర్ హాస్యనటుడు.. జగన్ వద్దకు వచ్చేసరికి మాత్రం ఎలాంటి కండిషన్లు పెట్టకుండా బేషరతుగా వైసీపీలో జాయిన్ అయ్యాడు. తన సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు, ఎన్నికల టైమ్ లో కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం జోరుగా చేశారు.
ఈ విధేయతను జగన్ కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారనేది అలీ నమ్మకం. నిజమే, జగన్ అలా మరిచిపోయే రకం కాదు. కేవలం విధేయత ఆధారంగా మంత్రి పదవులు అందుకున్న నేతలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నారు. కేవలం విధేయత ఆధారంగా మంచి నామినేటెడ్ పదవులు సైతం పొందిన నేతల్ని మనం చూస్తున్నాం. కాబట్టి అలీ విషయంలో అన్యాయం జరుగుతందని అనుమానాలు అక్కర్లేదు. కచ్చితంగా పార్టీలో అతడికి మంచి ప్రాధాన్యం దక్కుతుంది. కాకపోతే అది కాస్త ఆలస్యమౌతోంది. అంతే తేడా.