ఇప్పటివరకు పూరి జగన్నాధ్ తో చేసిన హీరోలెవరు అతడి వర్క్ లో వేలు పెట్టలేదు. అలా వేలు పెట్టిన పవన్ లాంటి హీరోలతో తను సినిమాలు చేయనని పూరి ఇదివరకే ప్రకటించాడు. పైగా రీసెంట్ గా ఫ్లాప్ ఇచ్చిన హీరోలు, కొత్త హీరోలతోనే సినిమాలు చేయడంతో పూరి జగన్నాధ్ కు ఇలాంటి సమస్య ఎక్కడా ఎదురుకాలేదు. చివరికి బాలయ్యతో చేసినప్పుడు కూడా పూరి పనికి అంతరాయం కలగలేదు. కానీ ఇప్పుడు వ్యవహారం వేరు. అక్కడున్నది విజయ్ దేవరకొండ.
తన సినిమాలకు సంబంధించి మేకింగ్ నుంచి ప్రమోషన్ వరకు ప్రతి విషయంలో తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటాడు విజయ్ దేవరకొండ. ఫ్లాప్ అయిన నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలకైతే అన్నీ తానై చూసుకున్నాడు. ఇక గీతగోవిందం, టాక్సీవాలా, అర్జున్ రెడ్డి లాంటి సినిమాల స్క్రిప్ట్ లో కూడా విజయ్ ప్రమేయం ఉంది. ఈ విషయాన్ని ఆ దర్శకులే ఒప్పుకున్నాడు. మరి సూపర్ సీనియర్ అయిన పూరి జగన్నాధ్ తో విజయ్ కు ఇలాంటి వ్యవహారాలు వర్కవుట్ అవుతాయా అనేదే సమస్య.
రీసెంట్ గా కొంతమంది మీడియా మిత్రులు పూరి జగన్నాధ్ వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దానికి అదిరిపోయే సమాధానం ఇచ్చాడు పూరి. తను అనుకున్న కథను మార్చనంత వరకు హీరోలు ఎన్ని మార్పులు చెప్పినా చేస్తాడట పూరి జగన్నాధ్. నిజానికి ఈ విషయంలో హీరోల సలహాలు-సూచనలకే తొలి ప్రాధాన్యం ఇస్తాడట. ఈ సందర్భంగా పూరి చెప్పిన ఓ ఉదాహరణ కూడా మీడియా మిత్రుల్ని బాగా ఎట్రాక్ట్ చేసింది. అదే శివమణి సినిమా.
శివమణి సినిమా అనుకున్నప్పుడు నాగార్జున ఆ సినిమాకు చాలా మార్పులు చెప్పాడట. నాగ్ చెప్పిన మార్పులన్నీ చేశానని చెప్పుకొచ్చాడు పూరి. తాజాగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా విషయంలో కూడా ఇలానే జరిగిందని చెప్పుకొచ్చాడు. రామ్ తో కూర్చొని సన్నివేశాలు రాసినట్టు చెప్పాడు. సో.. విజయ్ దేవరకొండతో తనకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదంటున్నాడు ఈ దర్శకుడు. అయితే కథ మార్చమంటే మాత్రం తనకు అమాంతం కోపం వచ్చేస్తుందని చెబుతున్నాడు.
ఈ సంగతులన్నీ పక్కనపెడితే.. కలిసి వర్క్ చేద్దాం అనే కండిషన్ ను విజయ్ దేవరకొండ ముందే చెబుతాడనే విషయం తెలిసిందే. ఆ కండిషన్ కు పూరి జగన్నాధ్ ఒప్పుకున్నాడు కాబట్టే ఫైటర్ ప్రాజక్టు ఫైనలైజ్ అయింది. అయితే విజయ్ ఎన్ని మార్పుచేర్పులు చేసినా ఫైనల్ అవుట్ పుట్ వచ్చేసరికి అందులో పూరి జగన్నాధ్ మార్క్ మాత్రమే కనిపిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే కదా.