తిరుపతి ఉప పోరులో విజయం సాధిస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీకి వచ్చే ఓట్లపై బెట్టింగ్స్ జరుగుతున్నాయి. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మృతితో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకనే ఎంతో ముందుగానే బీజేపీ తిరుపతిలో ఎన్నికకు సమాయత్తం అయ్యింది. తన మిత్రపక్షమైన జనసేనకు తిరుపతి, శ్రీకాళహస్తిలో బలమైన బటమైన ఓటు బ్యాంకు ఉండడంతో సత్తా చాటేందుకు ఇదే సరైన సమయమని బీజేపీ దూకుడు ప్రదర్శించింది. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికలో విజయంతో ఏపీ బీజేపీలో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది.
ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ బరిలో నిలిచేందుకు సమాయత్తం అయ్యింది. అయితే అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ జాప్యం చేయడం విమర్శలకు దారి తీసింది. చివరికి ఐఏఎస్ అధికారి రత్నప్రభను బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిపాయి. జనసేనాని పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. రత్నప్రభకు మద్దతుగా ఆయన తిరుపతిలో పాదయాత్ర నిర్వహించడంతో పాటు బహిరంగ సభలో ప్రసంగించారు.
తిరుపతి పార్లమెంట్ ఎన్నికల కన్వీనర్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ద్వేషించే కడప జిల్లా జమ్మలమడుగు సీనియర్ నేత ఆదినారాయణరెడ్డిని బీజేపీ నియమించింది. బీజేపీకి మద్దతుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, సునీల్ దేవ్‌ధర్ తదితర నేతలంతా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
నిన్న ఎన్నికల ప్రక్రియ ముగిసింది. తిరుపతి ఉప పోరు పుణ్యాన బీజేపీ అంటే వైసీపీ, టీడీపీ నేతల్లో ఎంతోకొంత భయం పోయింది. ఘాటు విమర్శలతో బీజేపీ నేతలకు ప్రత్యర్థులు చుక్కలు చూపించారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ సహ ఇన్‌చార్జ్ సునీల్ దేవ్‌ధర్‌పై మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు చూస్తే …అధికార పార్టీ లెక్కలేని తనం స్పష్టమవుతుంది.
ఈ నేపథ్యంలో బీజేపీ ఫర్మామెన్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో బీజేపీ సాధించే ఓట్లపై ఏపీ వ్యాప్తంగా బెట్టింగులు జరుగుతున్నట్టు సమాచారం. మరీ ముఖ్యంగా బీజేపీ 30 వేల పైన 50 వేల లోపు ఓట్లు మాత్రమే సాధిస్తుందని పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు సాగుతున్నట్టు సమాచారం. బీజేపీ 50 వేల పైన ఓట్లు దక్కించుకుంటుందని పందెం పెట్టే వాళ్లే లేరంటే …ఆ పార్టీ ఫర్మామెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
జనసేనతో పొత్తు ఉండడం వల్లే ఆ మాత్రమైనా ఓట్లు సాధిస్తుందనేది మెజార్టీ ప్రజాభిప్రాయం. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా పోటీ చేసి 16,125 ఓట్లు దక్కించుకుంది. తన ప్రస్తుత మిత్రపక్షమైన జనసేన మద్దతుతో నిలిచిన బీఎస్పీ నాడు 20,971 ఓట్లు దక్కించుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ పరిధిలో నియోజక వర్గాల వారీగా బీజేపీ సాధించిన ఓట్ల వివరాలను తెలుసుకుందాం.
సర్వేపల్లిలో 1636, గూడూరులో 1583, సూళ్లూరుపేటలో 2057, వెంకటగిరిలో 1519, తిరుపతిలో 4400, శ్రీకాళహస్తిలో 3111, సత్యవేడులో 1695 ఓట్లు దక్కాయి. ముఖ్యంగా తిరుపతిలో 4,400 ఓట్లు రావడం గమనార్హం. ఆ తర్వాత స్థానం శ్రీకాళహస్తిదే. ఇప్పుడు జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీలో బరిలో దిగడం కొత్తగా చోటు చేసుకున్న మార్పు. అయితే తిరుపతి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 12 వేల పైచిలుకు ఓట్లు వస్తే, అదే పార్లమెంట్‌కు వచ్చే సరికి ఆ పార్టీ బలపరిచిన బీఎస్పీ అభ్యర్థికి 5,045 ఓట్లు రావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో జనసేన అభ్యర్థి ఉంటే తప్ప, ఆ పార్టీ మద్దతు ఇచ్చిన ఇతర పార్టీలకు మద్దతు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే రత్నప్రభ కోసం పవన్‌కల్యాణ్ అదే పనిగా వచ్చి తన అక్కను గెలిపించాలని పిలుపునివ్వడంతో జనసేన కార్యకర్తల్లో ఒక మేరకు మార్పు వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి సహజంగా తిరుపతిలో నాలుగైదు వేల ఓట్లకు జనసేన మద్దతు తోడు కావడంతో మరో ఐదు వేల ఓట్లు కలిసొస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో తిరుపతి అసెంబ్లీ పరిధి వరకూ బీజేపీ 10 వేల ఓట్లు సాధిస్తుందని అంచనా.
ఇక శ్రీకాళహస్తికి వెళితే …అక్కడ బీజేపీలో కోలా ఆనంద్ బలమైన నాయకుడు. తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ప్రజా బలం ఉన్న ఏకైక నాయకుడు కూడా అతనే అని చెప్పొచ్చు. చానళ్లలో కనిపిస్తున్న మిగిలిన నేతలంతా పార్టీకి భారమే తప్ప లాభం కాదనే విషయం బీజేపీ అగ్రనేతలకు కూడా బాగా తెలుసు.
కోలా ఆనంద్ పలుకుబడితో శ్రీకాళహస్తిలో 5 వేల ఓట్లు వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కో చోట 3 వేలు వేసుకున్నా …మొత్తం 15 వేలకు మించవని ఓ అంచనా. ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ పరిధిలో బీజేపీ సాధించే మొత్తం ఓట్లు 30 వేలు అని ఓ లెక్క.
మరోవైపు ఎన్నికల రోజు ఒక్క తిరుపతిలో తప్ప మరెక్కడా బీజేపీ నేతల అలికిడే లేదు. మిత్రపక్షమైన జనసేనతో సమన్వయం అంతకంటే లేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీ సాధించే ఓట్లపై పందేలు జోరందుకున్నాయని చెప్పొచ్చు.
సొదుం రమణ