పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సర్వేల్లో పేర్కొంటున్న సీట్ల సంఖ్యలో ముందు నిలుస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికలకు తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ తరఫున ఎంపీగా ఉన్న భగవంత్ మాన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఈ ప్రకటనకు ముందు ఆప్ చాలా కసరత్తే చేసింది. ప్రజల అభిప్రాయాలను తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. మరి ఆ అభిప్రాయాలను ఏం తీసుకుందో కానీ.. భగవంత్ సింగ్ మాన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.
ఆప్ తరఫున 2014 లోక్ సభ ఎన్నికల్లోనే భగవంత్ మాన్ ఎంపీగా నెగ్గారు. తొలి సారి ఎంపీగా ఎన్నికయినప్పుడే లోక్ సభలో తన ప్రసంగాలతో మాన్ మంచి గుర్తింపును పొందారు. విధాన పరంగా మోడీ సర్కారు తీరును ఎండగట్టడంలో మాన్ తన వాగ్ధాటిని ప్రదర్శించారు. ఆ తర్వాత మద్యం విషయంలో ఏదో వివాదంలో కూడా మాన్ పేరు వినిపించింది.
ఇక రెండో సారి కూడా భగవంత్ మాన్ ఆప్ తరఫున గత ఎన్నికల్లో ఎంపీగా నెగ్గారు. ఇలా రెండు సార్లు ఎంపీగా నెగ్గిన నేపథ్యం ఉన్న సొంత పార్టీ నేతను ఆప్ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. పంజాబ్ ఎన్నికల విషయంలో సీఎం అభ్యర్థిత్వం విషయంలో క్లారిటీ ఉన్నది ఆప్ కే కాబోలు. కాంగ్రెస్ పార్టీ తను గెలిస్తే ప్రస్తుత సీఎంనే కొనసాగిస్తుందా లేక సిద్ధూను సీఎంగా చేస్తుందా అనే క్లారిటీ ఇవ్వడం లేదు. బీజేపీకి సీఎం అభ్యర్థిని ప్రకటించుకోవడం కూడా దండగా. బహుశా అమరీందర్ సింగ్ నే తన సీఎం అభ్యర్థి అంటుంది కాబోలు! ఇక శిరోమణి అకాళీదళ్ కు సీఎం అభ్యర్థి ఉండనే ఉన్నారు కానీ.. సర్వేల్లో మాత్రం ఆ పార్టీ బాగా వెనుకబడింది.
117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఆప్ కు యాభైకి పైగా సీట్లు, కాంగ్రెస్ కు యాభై సీట్ల వరకూ రావొచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఈ రెండు పార్టీలకూ స్పష్టమైన ఆధిక్యం రాదని, పోటాపోటీ పరిస్థితి ఖాయమని అంచనా వేస్తున్నాయి. మరి ఇదే జరిగితే పది సీట్ల వరకూ నెగ్గగలదంటున్న శిరోమణి అకాళీదళ్ ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కావొచ్చు.