ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు త్వరగా కోలుకొని రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారు. తాను కరోనా బారిన పడినట్టు, స్వల్ప లక్షణాలు ఉన్నట్టు చంద్రబాబు ట్విటర్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారని సమాచారం.
బాబు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని జగన్ ఆకాంక్షించడం విశేషం. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. పేద, ధనిక అనే తేడా లేకుండా ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మహమ్మారి తన ప్రతాపం చూపుతోంది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడి ఆస్పత్రుల పాలయ్యారు.
చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్, మాజీ మంత్రి దేవినేని ఉమా తదితర టీడీపీ నాయకులు కరోనా బారిన పడడం ఆ పార్టీ శ్రేణుల్ని కాసింత ఆందోళనకు గురి చేస్తోంది. తమ నాయకులు త్వరగా కోలుకోవాలని టీడీపీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.
ప్రస్తుతం ఉండవల్లిలోని హోం ఐసోలేషన్‌లో ఉంటున్న చంద్రబాబు ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని జగన్ ఆకాంక్షించడం మంచి సంప్రదాయమని చెప్పొచ్చు.