న‌మ్మించి మోస‌గించిన ఏపీ స‌ర్కార్‌!

రాత్రికి రాత్రి ఏపీ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు సంబంధించిన జీవోల జారీపై నిర‌స‌న వెల్లువెత్తుతోంది. త‌మ‌ను న‌మ్మించి ఏపీ స‌ర్కార్ మోస‌గించింద‌ని ఉద్యోగ సంఘాల నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. హెచ్ఆర్ఏ , అలాగే ఫిట్‌మెంట్…

రాత్రికి రాత్రి ఏపీ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు సంబంధించిన జీవోల జారీపై నిర‌స‌న వెల్లువెత్తుతోంది. త‌మ‌ను న‌మ్మించి ఏపీ స‌ర్కార్ మోస‌గించింద‌ని ఉద్యోగ సంఘాల నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. హెచ్ఆర్ఏ , అలాగే ఫిట్‌మెంట్ త‌గ్గింపుపై ఉద్యోగ వ‌ర్గాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ఉద్యోగ సంఘాల నాయ‌కులు బండి శ్రీ‌నివాస‌రావు, బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు ఇవాళ మీడియా ముందుకొచ్చారు.

త‌మ‌ను ఏ మాత్రం సంప్ర‌దించ‌కుండా పీఆర్సీపై రాత్రికి రాత్రే విడుద‌ల చేసిన జీవోల‌ను తాము అంగీక‌రించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. సంక్రాంతి త‌ర్వాత సానుకూల నిర్ణ‌యం వెలువ‌డుతుంద‌ని చెప్పిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం… న‌మ్మించి మోసం చేసింద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఐఆర్ కంటే త‌క్కువ ఫిట్‌మెంట్ ఇచ్చిన దాఖ‌లాలు లేవ‌ని అన్నారు. త‌మ‌కు కొత్త పీఆర్సీ అవ‌స‌రం లేద‌ని వారు తేల్చి చెప్పారు.

అలాగే ఈ జీవోలు త‌మ‌కు వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు. తాము వాటిని తిర‌స్క‌రిస్తున్న‌ట్టు ఉద్యోగ సంఘాల నేత‌లు తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఆర్థిక ప‌రిస్థితి బాగున్న‌ప్పుడే ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అంతేకానీ, ప‌దేళ్ల‌కు ఒక‌సారి ఇచ్చే పీఆర్సీ త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు ప్ర‌భుత్వానికి సూటిగా చెప్పారు. పాత ప‌ద్ధతిలోనే పీఆర్సీ ఇచ్చే వ‌ర‌కూ పోరాడుతామ‌న్నారు.

ఉద్యోగ‌, ఉపాధ్యాయుల‌పై ప్ర‌భుత్వానికి ఎంత మాత్రం ప్రేమ లేద‌న్నారు. డీఏల‌ను అడ్డు పెట్టుకుని పీఆర్సీ ఇచ్చార‌న్నారు. ఉద్యోగ‌, ఉపాధ్యాయ వ‌ర్గాల‌కు ఇది ఒక చీక‌టి రోజుగా అభివ‌ర్ణించారు. రివ‌ర్స్ టెండ‌రింగ్ విధానంలో రివ‌ర్స్ పీఆర్సీ ఇచ్చార‌ని ధ్వ‌జ‌మెత్తారు.  న‌మ్మిన ప్ర‌భుత్వ‌మే త‌మ‌ను మోస‌గించింద‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు వాపోవ‌డం గ‌మ‌నార్హం. 

మొత్తానికి ఉద్యోగుల స‌మ‌స్య ప‌రిష్కార‌మైన‌ట్టే అయి… తిరిగి రివ‌ర్స్ కావ‌డం ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారింది. అసంబ‌ద్ధ విధానాల‌తో ప్ర‌భుత్వం అన‌వ‌స‌రంగా వ్య‌తిరేక‌త తెచ్చుకుంటోంద‌నేందుకు ఇదే నిలువెత్తు నిద‌ర్శ‌నం.