మీడియంలో మార్పు అనివార్యం …కేసీఆర్ కూడా అదే బాటలో

సమాజంలోని అన్ని రంగాల్లో మార్పులు వస్తూనే ఉంటాయి. ఇది సహజ పరిణామం. మార్పులు అనేవి రాకపోతే ఇప్పటికీ రాతి యుగంలోనే ఉండేవాళ్ళం. ప్రజలు తమ జీవితాలను మెరుగుపరిచే మార్పులు ఏం కోరుకుంటారో ఈ మార్పులు…

సమాజంలోని అన్ని రంగాల్లో మార్పులు వస్తూనే ఉంటాయి. ఇది సహజ పరిణామం. మార్పులు అనేవి రాకపోతే ఇప్పటికీ రాతి యుగంలోనే ఉండేవాళ్ళం. ప్రజలు తమ జీవితాలను మెరుగుపరిచే మార్పులు ఏం కోరుకుంటారో ఈ మార్పులు చేయడం ప్రభుత్వాల బాధ్యత. ఒక జీవన విధానానికి లేదా ఒక భావ జాలానికి అలవాటుపడిన వారు మార్పును వెంటనే అంగీకరించరు. అలా అంగీకరించకపోతే, ఆ మార్పును అన్వయించుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుంది.

అసలు విషయం ఏమిటంటే … ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాధమిక పాఠశాల నుంచి ఇంగ్లిష్ మీడియంలోనే విద్యా బోధన అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. దీన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేశాయనుకోండి. అది వేరే విషయం. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఇంగీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ కూడా రాజకీయం చేసింది. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాల స్పాన్సర్షిప్ తో తెలుగు భాషాభిమానులు, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు రచ్చ రచ్చ చేశాయి.

ఇంగీష్ మీడియం ఉన్నత వర్గాలకేనా? బడుగు బలహీన వర్గాలకు అక్కరలేదా? అంటూ జగన్ ఎదురు దాడి చేశారు. నిజానికి సమాజంలో అన్ని వర్గాలవారు ఇంగ్గీష్ మీడియం వైపే మొగ్గుచూపుతున్నారు. ఇంగ్లిష్ మీడియం మీద మోజు కారణంగానే ఆర్ధికంగా కష్టాలు ఎదురైనా తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. డబ్బు లేనివారు ప్రభుత్వ పాఠశాలలలో తెలుగు మీడియంలో చదివిస్తున్నారు.

ఇంగ్లిష్ మీడియం వైపే మొగ్గు చూపడానికి కారణం ఏమిటంటే ….ఇప్పుడున్న సాంకేతిక ప్రపంచంలో పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశ పడటమే. ముఖ్యంగా ఐటీ రంగం వెయ్యికాళ్ల జెర్రీ మాదిరిగా పెరిగిపోయాక ఇంగ్లిష్ మీడియానికి ప్రాధాన్యం పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ టెక్నీకల్ నాలెడ్జ్ కు ప్రాధాన్యం పెరిగింది. తెలుగు మీడియంలో చదువుకుంటే ఉపయోగం ఉండదనే అభిప్రాయం సమాజంలో బలంగా పాతుకుపోయింది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజులు ఉండవు. మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యం ఉంటుంది. అయినప్పటికీ బడుగు బలహీన వర్గాల వారు అంటే ఆర్ధికంగా బలహీనులుగా ఉన్నవారు కూడా భారీగా ఫీజులు కడుతూ తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. అలాగే ఈ పాఠశాలలకు ఉన్నంత హంగూ ఆర్భాటాలు ప్రభుత్వ పాఠశాలలకు లేవు. 

కొన్ని పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా లేవు. దీంతో ఏపీ సీయం జగన్ తన మీద ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం పెట్టడంతో పాటు సర్కారు పాఠశాలల రూపు రేఖలను మార్చారు. ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్న సోకాల్డ్ ఉపాధ్యాయ సంఘాలవారు తమ పిల్లలను మాత్రం కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు.

ఈ చదువు కోసమే పల్లెల్లో పని చేస్తున్న టీచర్లు కుటుంబాలను పట్నాల్లో, నగరాల్లో ఉంచుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడంతో ప్రభుత్వాలు ఆ పాఠశాలలను మూసేస్తున్నాయి. కేవలం తెలుగు మీడియం కారణంగా తలెత్తిన పరిస్థితి ఇది. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం పెట్టాలని డిమాండ్ చేసేవారు ఎక్కువయ్యారు. కారణాలు ఏమైనా కానీ రెండు తెలుగు ప్రభుత్వాలు ఇంగ్లిష్ మీడియం వైపు మొగ్గు చూపాయి.

తాజాగా జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్  మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం విధివిధానాలు రూపొందించి చట్టం చేయడానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ నియమించాలని నిర్ణయించారు. అయితే ఇందులో కీలకమైన విషయం చట్టం చేయడం. ఎందుకంటే … తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే తెలుగు మీడియంతోపాటు ఇంగ్లిష్ మీడియంలోనూ బోధన జరుగుతోంది. అయితే హైస్కూలు నుంచే ఇంగ్లిష్ లో బోధిస్తున్నారు.

అంటే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకున్న మాట. ఏ మీడియంలో చదవాలనేది విద్యార్థుల ఇష్టం. ఇంగ్లిష్ మీడియంలోనే చేరతామంటే పాఠశాల యాజమాన్యం కాదనడానికి వీలులేదు. రెండు మీడియంలు ఉండే పాఠశాలను సక్సెస్ స్కూల్స్ అంటున్నారు. కొన్ని పాఠశాలల్లోనే ఇంగ్లిష్ మీడియం ప్రయోగాత్మకంగా అమలు చేశారు.

వీటిని ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేశారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే వచ్చే ఏడాది నుంచి తెలంగాణా ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియంను ప్రాథమిక పాఠశాలల నుంచి కంపల్సరీ చేస్తుందా? దీని మీదనే ఇప్పుడు ప్రజల్లో చర్చ జరుగుతోంది.