దేశంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతూ ఉంది. మంగళవారం నాడు వెళ్లడించిన సమాచారం ప్రకారం.. దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య రెండున్నర లక్షల్లోపుకు తగ్గింది. అంతకు ముందు రోజుతో పోలిస్తే ఇరవై వేల స్థాయిలో కేసులు తక్కువగా నమోదయ్యాయి.
కేసులు తగ్గిన రాష్ట్రాల్లో ఢిల్లీ, యూపీలు ఉన్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో క్రితం రోజుతో పోలిస్తే రోజువారీ కేసులు వెయ్యికి పైగా తగ్గినట్టుగా ప్రకటించారు. కేసులు పెరుగుతాయనుకున్న పరిస్థితుల్లో తగ్గుముఖం పట్టడం విశేషం. అలాగే ముంబైలో కూడా గత వారంతంలోనే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినట్టుగా గణాంకాలను బట్టి తెలుస్తూ ఉంది.
ఇక కరోనా మూడో వేవ్ ప్రభావం గురించి విశ్లేషిస్తున్న వారు.. జనవరి నెలాఖరుకూ లేదా ఫిబ్రవరి మొదటి వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో మూడో వేవ్ పూర్తిగా తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియెంట్ పతాక స్థాయిని చేరడానికి మూడు వారాలు పడుతుందని అంచనా. ఇప్పటికే ఒమిక్రాన్ ప్రభావం మొదలై మూడు వారాలు గడుస్తున్న చోట ఇప్పుడు కేసులు తగ్గుదల చోటు చేసుకోవచ్చని వీరు అభిప్రాయపడుతున్నారు.
దేశంలో పలు చోట్ల మూడో వేవ్ కేసులు రిజిస్టర్ కాబట్టి మూడు వారాలు గడిచాయి. అలాంటి చోట ఇప్పుడు కేసులు అవరోహన క్రమంలో సాగవచ్చని, జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఇలాంటి చోట మూడో వేవ్ ముగుస్తుందని అంచనా. అయితే దేశం మొత్తం మాత్రం ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మార్చి నెలాఖరుకు మూడో వేవ్ దేశ వ్యాప్తంగా పూర్తిగా తగ్గుముఖం పట్టవచ్చని అంచనా.