ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అక్కసు ప్రదర్శించే క్రమంలో నారా భువనేశ్వరిని మరోసారి బజారుకీడ్చారు. అసెంబ్లీ వేదికగా తన భార్యను దూషించారంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెక్కివెక్కి ఏడ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, జగన్ ప్రభుత్వం తన భార్య పట్ల అనుచిత వైఖరికి నిరసనగా అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తిరిగి ముఖ్యమంత్రిగా తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టనని ఆయన శపథం చేశారు.
అయితే తాము భువనేశ్వరిని ఏమీ అనలేదని, ఆయన ఏదో ఊహించుకుని ఆమెను బజారుకీడ్చారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు పదేపదే చెప్పారు. భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పారు. ఇంతటితో ఆ ఎపిసోడ్ ముగిసిపోయిందని భావించారు.
కానీ భువనేశ్వరిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు మొదలుకుని ఎల్లో మీడియా రాజకీయ వికృత క్రీడకు తెరలేపారు. ఈ నేపథ్యంలో ఏకంగా నారా భువనేశ్వరినే అసెంబ్లీ ఘటనపై ఓ చానల్ ఇంటర్వ్యూ చేయడం గమనార్హం. ఆలయం లాంటి అసెంబ్లీలో ఏమి చర్చించాలో అదే చర్చించాలని భువనేశ్వరి చెప్పారు. అసెంబ్లీలో ఏం మాట్లాడారో తనకు అనవసరమని ఆమె స్పష్టం చేశారు.
తనకు భర్త సపోర్ట్ ఉందన్నారు. తన భర్త బాబు కన్నీళ్ల వెనుక తనపై ప్రేమను చూసినట్టు ఆమె అన్నారు. ఎవరి క్షమాపణ తనకు అనవసరమన్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినపుడు వారం, పది రోజులు తట్టుకోలేక పోయినట్టు భువనేశ్వరి తెలిపారు. తనపై జరిగిన దాడికంటే, మహిళలపై జరుగుతున్న అకృత్యాలు దారుణంగా ఉన్నాయని ఆమె వాపోయారు. తనపై దాడి తర్వాతే తనలాగే దాడికి గురవుతున్న మహిళల వ్యథ మరింతగా ఆర్థమైందని ఆమె అనడం విశేషం.
అలాగే మహిళను గౌరవించే సంస్కృతి ఉండేలా ఓ తల్లిగా లోకేష్‌ను పెంచినట్టు భువనేశ్వరి తెలిపారు. అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఎల్లో బ్యాచ్‌కు మాత్రం చాలా అవసరమనే సంగతి భువనేశ్వరికి తెలిసినట్టు లేదనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ముగిసిపోయిన అధ్యాయాన్ని మళ్లీ తెరపైకి తేవడం వెనుక దురుద్దేశం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి చర్యలతో భువనేశ్వరి గౌరవాన్ని ఎలా కాపాడుతారని అనుకుంటున్నారో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.