బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఒకింత సంచలన, ఆసక్తిదాయకమైన ఫలితాలను వెల్లడిస్తున్నాయి. పూర్తి స్థాయిలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో.. వివిధ ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏకగ్రీవంగా ఆర్జేడీ- కాంగ్రెస్ ల హవా ఉంటుందని చెబుతున్నాయి.
కొన్ని సర్వేలు అయితే.. ఈ కూటమి సంచలన విజయం సాధిస్తుందని కూడా చెబుతున్నాయి. మరి కొన్ని సంస్థలు హంగ్ తరహా పరిస్థితులు ఏర్పడవచ్చు అని అంటున్నాయి. ఏతావాతా.. ఎన్డీయే కూటమి విజయాన్ని అంచనా వేస్తున్న ఎగ్జిట్ పోల్ సర్వేలు మాత్రం తక్కువగానే కనిపిస్తున్నాయి.
ప్రీ పోల్ సర్వేల్లో ఎన్డీయే భారీ విజయాన్ని సాధిస్తుందంటూ కొన్ని సంస్థలు చెప్పుకొచ్చాయి. అయితే ఇప్పుడు అవే సంస్థల్లో కొన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తూ ఆర్జేడీ- కాంగ్రెస్ ల కూటమి విజయాన్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉండటం గమనార్హం. వివిధ వార్తా సంస్థలు, అధ్యయన సంస్థలు వెల్లడించిన బిహార్ ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
టైమ్స్ నౌ- సీ ఓటర్- ఎన్డీయే 116, ఆర్జేడీ కూటమి 120, ఇతరులు ఏడు.
ఇండియాటుడే- యాక్సిస్- ఎన్డీయే 80, ఆర్జేడీ కూటమి 150
రిపబ్లిక్ జన్ కీ బాత్ – ఎన్డీయే 104, ఆర్జేడీ కూటమి 128
టుడేస్ చాణక్య -ఎన్డీయే 55, ఆర్జేడీ కూటమి 180
ఈ సర్వేల యావరేజ్ ను తీసుకుంటే ఆర్జేడీ కూటమి 140 సీట్ల వరకూ నెగ్గే అవకాశం ఉంది, ఎన్డీయే కూటమి 100 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశాలున్నాయని అంచనా!
ఈ తరహా ఎగ్జిట్ పోల్స్ విడుదల అవుతాయని కమలం పార్టీ శ్రేణులు బహుశా అంచనా వేయకపోయి ఉండవచ్చు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ చాలా కష్టపడ్డారు. అన్ని అంశాలనూ ప్రస్తావించి.. మరీ ఓటడిగారు.
ఎగ్జిట్ పోల్స్ చూస్తే గట్టి ఝలక్ తగిలేలా ఉంది. అయితే ఇవెలా ఉన్నా, అసలు ఫలితాలే అసలు విషయాన్ని చెప్పబోతున్నాయి. నవంబర్ 10వ తేదీన బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.