రియల్ లైఫ్ మామ-కోడళ్లు నాగార్జున-సమంత మధ్య పోటీ ఎందులో ఉంటుంది? సినిమాల పరంగా వీళ్లిద్దరి మధ్య పోటీని అస్సలు ఊహించలేం. ఆ మాటకొస్తే సమంత ఇప్పుడు సినిమాలే చేయడం లేదు. అయితే లాక్ డౌన్ టైమ్ లో నాగార్జునకు, తనకు మధ్య మంచి పోటీ నడిచిన విషయాన్ని సమంత బయటపెట్టింది.
“నాగ్ మామకు నాకు మొక్కల విషయంలో మంచి కనెక్షన్ ఏర్పడింది. మా ఇద్దరికీ మొక్కలంటే ఇష్టం. ఎవరు నాటిన మొక్క బాగా పెరుగుతుందో మేం పోటీలు పెట్టుకుంటాం. నేను నాగ్ ఇంటికి వెళ్లినప్పుడు ఆయన పెంచిన మొక్కలు చూసి ఆశ్చర్యపోతాను. నాగ్ కూడా మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఎలా మొక్కలు పెంచుతున్నానో అడిగి తెలుసుకుంటారు.”
మామ కంటే బాగా తను మొక్కలు పెంచితే నాగ్ తట్టుకోలేరని అంటోంది సమంత. అయితే నాగచైతన్య మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడని, చైతూ ఇంట్లో ఉంటే తను అన్నీ పక్కనపెట్టి అతడితోనే ఉంటానని చెబుతోంది.
మరోవైపు హీరోయిన్ కాకపోయి ఉంటే, ఏం చేసేవారు అనే ప్రశ్నకు కూడా నిజాయితీగా సమాధానమిచ్చింది సమంత. ఆస్ట్రేలియా వెళ్లిపోయేదాన్నని చెప్పుకొచ్చింది.
“మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువమందికి విదేశాలకు వెళ్లాలనే ఆశయం ఉంటుంది. బహుశా సినిమాల్లోకి రాకపోయి ఉంటే నేను కూడా విదేశాలకు వెళ్లేదాన్ని. ఆస్ట్రేలియాకు వెళ్లి ఉన్నత చదువులు చదివి అక్కడే మంచి ఉద్యోగం చూసుకొని సెటిల్ అయ్యేదాన్ని. కానీ దేవుడు నాకు సినిమాలు రాసిపెట్టాడు.”