తెలంగాణలో యాక్టివ్ …. ఆంధ్రాలో పూర్తి డల్

జాతీయ పార్టీలుగా చెప్పుకునే పార్టీలు పేరుకే జాతీయ పార్టీలు. కానీ రాష్ట్రాలవారీగా చూసినప్పుడు అవి ప్రాంతీయ పార్టీల కిందే లెక్క. కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలే కానీ ఆంధ్రా, తెలంగాణలో అవి ప్రాంతీయ పార్టీలే…

జాతీయ పార్టీలుగా చెప్పుకునే పార్టీలు పేరుకే జాతీయ పార్టీలు. కానీ రాష్ట్రాలవారీగా చూసినప్పుడు అవి ప్రాంతీయ పార్టీల కిందే లెక్క. కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలే కానీ ఆంధ్రా, తెలంగాణలో అవి ప్రాంతీయ పార్టీలే అనుకోవాలి. ఈ రెండు పార్టీలు తెలంగాణలో యాక్టివ్ గా ఉంటే ఆంధ్రాలో బాగా డల్ గా ఉన్నాయి. ఆ పార్టీలకు ఆ రాష్ట్రంలో కనీస ఆదరణ కూడా లేదు. 

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అధికార పార్టీ టీఆర్ఎస్ ను అంతో ఇంతో భయపెట్టే స్థాయిలో ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడానికి అధికార పార్టీ చెమటోడుస్తూనే ఉంది. ఇందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అక్కడ గెలుపు కోసం గులాబీ పార్టీ ఎంతగా కష్టపడుతున్నదో చూస్తున్నాం.

కానీ ఆంధ్రాలో అధికార వైసీపీకి ప్రతిపక్షాలు ఏమాత్రం భయం కలిగించలేకపోతున్నాయి. అంతో ఇంతో టీడీపీ బెటర్ గా ఉన్నట్లు కనబడుతున్నా బీజేపీ, కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడ్డాయి. ఆ రెండు పార్టీలను వైసీపీ పూర్తిగా పట్టించుకోవడం మానేసిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డిని మార్చి శైలజానాథ్ ను పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. బీజీపీ వాళ్ళు కన్నా లక్ష్మీనారాయణను మార్చి సోము వీర్రాజును నియమించినా ఇసుమంత కూడా లాభం లేదు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిని చేసిన తర్వాత పార్టీలో పునరుత్తేజం వచ్చింది. రేవంత్ బాగా స్పీడుగా ఉన్నాడు. కానీ సీనియర్ నాయకులు ఆయనకు  సహకరించకపోవడం మైనస్ పాయింట్ అయింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అధికార పార్టీ మీద విరుచుకుపడుతూనే ఉన్నాడు. మొత్తం మీద యేవో నిరసన కార్యక్రమాలతో, విమర్శలతో ప్రభుత్వానికి చికాకు పుట్టిస్తూనే ఉన్నారు. 

కానీ ఆంధ్రాలో ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు కనబడటం లేదు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏమాత్రం ఎదగలేకపోతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం జరిగి ఏడాదికి పైగానే అవుతుంది. అయితే ఇప్పటి వరకూ పార్టీలో ఒక్క చేరిక కూడా లేదు. 

జనసేనతో పొత్తు ప్రకటించిన తర్వాత కూడా పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగుపడలేదు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళదామనుకున్నా ఎక్కడా వీలు చిక్కడం లేదు. రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రాకు అన్యాయం చేశారనే కోపం ఆంధ్రా ప్రజల్లో ఇప్పటికీ తగ్గలేదు. విభజనకు కారణం కాంగ్రెస్, బీజేపీ అనే కసి విపరీతంగా ఉంది.

కాంగ్రెస్ సంగతి అలా ఉంచితే ఏపీకి బీజేపీ చేసిన అన్యాయం చాలా ఎక్కువని ప్రజలు భావిస్తున్నారు. విభజన తరువాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఏపీకి ఏమీ చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ కొంత పుంజుకుంటుందని భావించినా హామీలు అమలు చేయలేదు. పుండు మీద కారం చల్లినట్లుగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు పార్టీని మరింత కుంగదీశాయనే చెప్పాలి. 

ఇక సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను కొంత కట్ చేశారు. తొలి నుంచి ఉన్న నేతలతో పాటు, ఆర్ఎస్ఎస్ మూలాలున్న వారికే సోము వీర్రాజు ప్రాధాన్యత ఇస్తున్నారు. తొలినాళ్లలో చేరికలు ఉంటాయని భావించినా ఎవరూ బీజేపీ వైపు చూడటం లేదు. తిరుపతి ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాషాయం పార్టీకి మొండి చెయ్యే దక్కింది. 

తిరుపతి ఉప ఎన్నికలో ఎన్ని ఫీట్లు చేసినా, జనసేనతో పొత్తు పెట్టుకున్నా కమలాన్ని ప్రజలు పట్టించుకోలేదు. ఇక స్థానికసంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపీని బాగా దూరం పెట్టారు. దీంతో బీజేపీలో చేరి ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే టీడీపీలో ఇబ్బంది పడుతున్న వారు సయితం బీజేపీ వైపు చూడటం లేదు.

రాబోయే  కాలంలో ఉన్న నేతలే పార్టీని వీడి వెళతారన్న ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ కొంత పుంజుకోవడంతో ఆ నేతలు తిరిగి సొంత పార్టీవైపు చూస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ కూడా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఎన్నికల వరకూ పవన్ ప్రయాణం బీజేపీ తో కొనసాగుతుందన్నది అనుమానమే. అందుకే ఏపీలో బీజేపీ ఇక కోలుకోవడం కష్టమే. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అని కలలు కంటున్న కొందరు బీజేపీ నాయకులు ఆ పని చేయడం మానేస్తే ఆరోగ్యానికి మంచిది.