అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే పవన్ కు తన పంచ్ పవర్ రుచి చూపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత జనసేనానిని పూర్తిగా పక్కనపెట్టారు. నిజానికి ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ కు జగన్ ప్రాధాన్యం ఇవ్వనక్కర్లేదు. ఆయన పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం కానీ, ఆయన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం కానీ లేనే లేదు.
కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. పవన్ పూర్తిగా బరితెగించారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పై మరోసారి జగన్ తన డైలాగ్ పంచ్ పవర్ చూపిస్తారనే ప్రచారం సాగుతోంది.
గతంలో ఓసారి 3 పెళ్లిళ్లపై మాట్లాడినందుకే పవన్ ఇప్పటికీ తెగ గింజుకుంటున్నారు. నన్ను, నా పెళ్లిళ్లను అవమానిస్తారా అంటూ మాట్లాడుతున్నారు. ఎవరి లోపం, ఏంటి..? దేన్ని హైలెట్ చేస్తే జనాలు అట్రాక్ట్ అవుతారు అనేది రాజకీయ నాయకులకు బాగా తెలుసు.
విలువలు, వలువలు అంటూ మడికట్టుకు కూర్చునే రోజులు కావివి. ఓవైపు అక్రమాస్తులున్నాయని పూర్తి స్థాయిలో రుజువు కాకపోయినా.. జగన్ అక్రమాస్తుల కేసు అంటూ ఏళ్ల తరబడి ఆయనను మానసికంగా వేధిస్తోంది టీడీపీ అనుకూల మీడియా.
హత్యాయత్నం జరిగితే దాన్ని కోడికత్తి దాడి అంటూ సిల్లీగా తీసిపారేసి, జగనే అలా చేయించుకున్నాడని వ్యతిరేక ప్రచారంతో మరింత మానసిక వేదనకు గురిచేశారు. ఇలాంటి వాటితో పోల్చి చూస్తే పవన్ తనపై మానసిక అత్యాచారాలు జరిగాయని అనడం ఏ మూలకొస్తుంది. ఆ వేధింపులన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు కాబట్టే జగన్ ముఖ్యమంత్రి కాగలిగారు.
మరి చిన్న చిన్న విమర్శలకే పిసుక్కుంటున్న పవన్ ను ఏమనాలి? ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అవుతారు? ఇంతవరకు అసలు పవన్ ని సరిగా విమర్శించిందెవరు. చంద్రబాబు, లోకేష్ పై కొడాలి నాని వీరబాదుడు స్థాయిలో పవన్ పై వైసీపీ నేతలెవరూ ఫైర్ కాలేదు. ఇప్పుడు ఆ బాధ్యత సీఎం జగన్ తీసుకుంటారని అంటున్నారు.
జగన్ తిట్ల కోసమే పవన్ వెయిటింగ్
తన ప్రభుత్వం, తన మంత్రివర్గంపై పిచ్చిపిచ్చి ప్రేలాపనలు పేలుతున్న పవన్ కి, జగన్ నేరుగా గడ్డిపెట్టే రోజు వస్తుందని అంటున్నారు. ఆ రోజు కోసమే పవన్ తన డోసు పెంచుకుంటూ వెళ్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. తన వర్గం వారు తనని తిట్టడం వేరు, జగన్ వర్గం నుంచి తిట్టించుకోవడం వేరు. అలా జగన్ తిట్టిన వెంటనే, ఇలా మరోసారి తన వర్గాన్ని రెచ్చగొట్టి.. ఒక్కటి చేయడం పవన్ దురాలోచన.
ఇది చంద్రబాబు ప్లానా, పవన్ సొంత తెలివా అనేది అందరికీ తెలిసిందే. జగన్ ని రెచ్చగొట్టడం, జగన్ తో తిట్టించుకోవడం ఒక్కటే పవన్ తక్షణ కర్తవ్యం. పవన్ వ్యాఖ్యలకు జగన్ రెచ్చిపోయే రకం కాదు కానీ, ఎక్కడో ఓ చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకైనా పరోక్షంగా అయినా పవన్ వ్యాఖ్యలపై జగన్ స్పందిస్తారని అంటున్నారు. కనీసం తీసిపారేసేలా సింగిల్ డైలాగ్ తో ఈ ఎపిసోడ్ కి ముగింపు పలుకుతారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం జగన్ కి సొంత పార్టీ నేతలతో మాట్లాడటానికే సరిగ్గా సమయం సరిపోవడంలేదు. ఆయన, ఆయన సంక్షేమ పథకాలు, నవరత్నాలు.. ఇదే తాడేపల్లి గొడవ అంతా. ఈ దశలో చంద్రబాబు వ్యాఖ్యలకే రియాక్ట్ అవ్వని జగన్, ఆఫ్ట్రాల్ పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలకు స్పందిస్తారా అనే చర్చ కూడా నడుస్తోంది.