ఏపీ బీజేపీ నాయకులకు ఇపుడు మీడియా ముందు ఒక ప్రశ్న తెగ ఇబ్బంది పెడుతోంది. అదే జనసేనాని పవన్ విషయం. పవన్ మాకు మిత్రుడే అంటున్నారు. ఆయనేమో వైసీపీ వ్యతిరేక ఓటు ఎక్కడా చీలకూడదు, తానే ముందుండి అందరినీ కలిపేస్తాను అంటున్నారు. అలా చూసుకుంటే టీడీపీతో మైత్రికి జనసేనాని ఉత్సహాపడుతున్నారు అని రాజకీయ జీవులు అర్ధం చేసుకుంటున్నారు.
ఇక దీని మీద ఏపీ బీజేపీ నేతలు అయితే తమకు తోచిన విధంగా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అయితే పవన్ తోనే బీజేపీకి పొత్తు ఉంది. మరే పార్టీతోనూ లేదు, ఉండదు అని పక్కా క్లారిటీ ఇస్తున్నారు. ఇక బీజేపీలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అయితే పవన్ మిత్రుడే కానీ పార్టీల పరంగా ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటూ వెళ్తున్నామని చెప్పుకొచ్చారు.
అంతే కాదు ఏ విషయమైనా మిత్రుడుగా పవన్ తమతో చర్చిస్తే తాము కూడా దానికి స్పందిస్తామని అంటున్నారు. అంటే దాని అర్ధం పొత్తుల విషయమా, టీడీపీతో మైత్రికి సంబంధించి పవన్ బీజేపీతో చర్చించాలని అనుకుంటున్నారా అన్నది అయితే తెలియడంలేదు.
మొత్తానికి పవన్ బీజేపీని రోడ్ మ్యాప్ అడుగుతూంటే బీజేపీ నేతలు పవన్ తమతో చర్చించాలని అంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంటే రెండు పార్టీలూ ఎవరి మటుకు వారు వేరుగా కార్యక్రమాలు చేసుకుంటున్నా తమ మధ్యన పొత్తులు స్నేహాలు అలాగే ఉన్నాయని పురంధేశ్వరి అంటున్నారు.
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ చేస్తున్నది కేంద్రం, దాని మీద వస్తున్న విమర్శలకు బీజేపీ జవాబు చెప్పుకోవాలి. కానీ అలా చెప్పకుండా ఏపీలో వైసీపీ సర్కార్ కి ఉక్కు మీద మమ్మల్ని అడిగే హక్కు లేదని పురంధేశ్వరి చెప్పడం విడ్డూరమే అంటున్నారు.
మొత్తానికి బీజేపీ పవన్, బీజేపీ ఉక్కు ఇలా చాలా విషయంలో మీడియా అడుగుతున్న దానికీ కమలనాధులు చెబుతున్న మాటలకూ అర్ధాలు వేరులే అన్నట్లుగా ఉన్నాయి. మరీ ఇలా అయితే అర్ధం చేసుకోవడం కష్టమే సుమా అంటున్నారు అంతా.