అభిమానంతో వస్తున్నారా? ఆకర్షిస్తున్నారా?

ప్రస్తుత రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణమైపోయాయి. ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదు. పార్టీలు ఫిరాయించడం పాపం కాదని, నేరం కాదని ఫిరాయించే నాయకులే కాదు ప్రజలూ భావిస్తున్నారు. సాధారణంగా కంపెనీలు తమ అమ్మకాలు పెంచుకోడానికి సేల్స్‌మెన్లను…

ప్రస్తుత రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణమైపోయాయి. ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదు. పార్టీలు ఫిరాయించడం పాపం కాదని, నేరం కాదని ఫిరాయించే నాయకులే కాదు ప్రజలూ భావిస్తున్నారు. సాధారణంగా కంపెనీలు తమ అమ్మకాలు పెంచుకోడానికి సేల్స్‌మెన్లను నియమించుకొని ఈ ఏడాది ఇంత మేరకు అమ్మకాలు చేయాలని లక్ష్యాలు విధిస్తాయి. ఇందుకోసం రకరకాల ఆకర్షణీయ పథకాలతో కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. ప్రస్తుతం అన్ని పార్టీలు ఫిరాయింపుల వ్యవహారాన్ని ఇలాగే డీల్‌ చేస్తున్నాయి. ఇది ఎందుకు చెప్పుకోవల్సి వస్తోందంటే.. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 'పార్టీ మీద అభిమానంతో ఎవరు వచ్చినా బీజేపీలో చేర్చుకుంటాం' అన్నారు. నిజంగా బీజేపీపై అభిమానం ఉండి, ఆ పార్టీ సిద్ధాంతాలు ఇష్టపడి, జీవితాంతం దాంట్లో ఉండి దేశ సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నవారే బీజేపీలో చేరుతున్నారా? కన్నా లక్ష్మీనారాయణ ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలరా? ఈ ప్రశ్న ఒక్క బీజేపీకి సంబంధించిందే కాదు.

నాయకులకు పార్టీల పట్ల నిబద్ధత ఉంటుందనుకోవడం, ప్రేమాభిమానాలు ఉంటాయనుకోవడం భ్రమ మాత్రమే. పార్టీలు మారడానికి స్వప్రయోజనాలే కారణం. పార్టీ పట్ల నిజంగా ప్రేమ ఉన్న నాయకులు, దాని సిద్ధాంతాల పట్ల అభిమానం ఉన్న నేతలు గెలుపులోనే కాదు, ఓటమిలో సైతం పార్టీని విడిచిపోరు. కాని ఈ కాలంలో జరుగుతున్నది ఏమిటి? ఏ పార్టీ అధికారంలో ఉంటే పార్టీలోకి ఫిరాయిస్తున్నారు. ఏపీలో టీడీపీ ఓడిపోయాక చంద్రబాబు నాయుడికి 'కుడిఎడమల డాల్‌కత్తులు మెరయగా' అన్నట్లుగా వ్యవహరించి, ఆయన కోటరీలో కీలకపాత్ర పోషించిన నాయకులు బీజేపీలోకి వెళ్లిపోయారు. ఇది పార్టీపై అభిమానంతోనే అంటే నమ్మొచ్చా? బీజేపీలోకి వెళ్లడానికి కారణం వారిపై ఉన్న అభియోగాలేనని, కేసుల నుంచి విముక్తి పొందడానికేనని మీడియాలో కథనాలొచ్చాయి. వీరికి బీజేపీ మౌలిక సిద్ధాంతాలు కూడా తెలిసివుండకపోవచ్చు.

చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 మంది వైకాపా ఎమ్మెల్యేలను లాక్కున్నారు. వీరంతా టీడీపీ మీద ప్రేమతో రాలేదు కదా. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెసు నాయకులు, ఎమ్మెల్యేలు అనేకమంది టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరందరికీ గులాబీ పార్టీపై ప్రేమ పొంగిపొర్లిందా? కేసులున్నవారు, అక్రమ ఆస్తులు, నిర్మాణాలున్నవారు, కాంట్రాక్టులు సంపాదించుకోవాలని అనుకునేవారు, ఇతరత్రా ఏవేవో స్వప్రయోజనాలు కావాలనుకునేవారు అధికార పార్టీల్లో చేరుతున్నారు. ఫిరాయింపుదారులకు అధికారంలో ఏ పార్టీ ఉంటే దానిమీదనే అభిమానం కలుగుతుంది.

ఇది నిజమైన అభిమానం ఎలా అవుతుంది? ఒకప్పుడు సిద్ధాంత నిబద్ధత, సిద్ధాంత బలం ఉన్న పార్టీలుగా కమ్యూనిస్టు పార్టీలను ప్రధానంగా సీపీఐ, సీపీఎంలను, బీజేపీని చెప్పుకునేవారు. ఈ పార్టీల్లో లబ్ధప్రతిష్టులైన నాయకులు ఉండేవారు. రాజకీయాల్లో నిజాయితీగా వ్యవహరించిన నేతలు ఉండేవారు. ఫిరాయింపుల పేరెత్తని, ప్రోత్సహించని లీడర్లు ఉండేవారు. తన ప్రభుత్వం నిలబడటానికి ఒక్క ఓటు తక్కువ కాగానే వాజ్‌పేయి అధికారం వదులుకున్నారు తప్ప ఫిరాయింపుల ద్వారా అధికారం నిలబెట్టుకోవాలని అనుకోలేదు. అలా అనుకుని ఉంటే అదేమంత కష్టం కాకపోయేది. కాని వాజ్‌పేయిపై చెరగని 'మచ్చ' పడేది.

ఇంత నిబద్ధత ఉన్న బీజేపీ ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించే పార్టీగా మారిపోయింది. అనేక విధాలుగా ప్రలోభపెట్టి, బెదిరించి ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి లాక్కుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు రెండు పార్లమెంటు సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ ఎల్‌కే అద్వానీ, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, మరికొందరు ఉద్దండుల కారణంగా సైద్ధాంతిక బలంతో క్రమంగా ఎదిగి అధికారంలోకి రాగలిగింది. ఎప్పుడైతే నరేంద్రమోదీ-అమిత్‌ షా ద్వయం ప్ర్రస్థానం మొదలైందో అప్పటినుంచి బీజేపీ ఇతర పార్టీల మాదిరిగానే ప్రత్యేకత లేని పార్టీగా మారిపోయింది.

ఎవరంటేవారు బీజేపీలో సులభంగా చేరుతున్నారు. అనేక మార్గాల ద్వారా చేర్పించుకుంటున్నారు. పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు కొత్త కాకపోయినా ఒకప్పుడు ఇష్టమై స్వచ్ఛందంగా చేరేవారు. చేరేముందు తమ పదవులకు రాజీనామా చేసేవారు. ఇప్పుడు ఫిరాయింపులంటే పాత కండువా తీసేసి కొత్త కండువా కప్పుకోవడమే. ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్‌ తమ పార్టీలోకి వచ్చేవారు రాజీనామా చేసిరావాలనే షరతు విధించడంతో ఫిరాయింపుదారులు బీజేపీ వైపే మొగ్గుతున్నారు.

వైకాపాలో ఈ నిబంధన లేకుంటే టీడీపీలోని ఎమ్మెల్యేలు ఖాళీ అయ్యేవారు. సిద్ధాంతాలు, నిబంధనలు లేని జాతీయ పార్టీ కంటే, ఫిరాయింపులను ప్రోత్సహించని ప్రాంతీయ పార్టీయే గొప్పదని చెప్పుకోవచ్చు. 

విదేశం నుంచి కాపీ కాదు.. రీమేక్!